ఓ బ్యాంకు మేనేజర్ కమిషన్ కక్కుర్తి భారీ మోసానికి తెరలేచింది. హైదరాబాద్లోని షంషీర్ గంజ్ ఎస్బిఐ బ్యాంకులో గత వారం భారీ కుంభకోణం గుర్తించారు. రూ.175 కోట్ల నగదును బ్యాంకు నుంచి ఆరు కరెంటు ఖాతాలకు అక్కడ నుంచి దుబాయ్ తరలించినట్లు తేలింది. ఈ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ గాలి మధుబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.మరో నిందితుడు జిమ్ ట్రైనర్ సందీప్ శర్మను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
షంషీర్గంజ్ స్టేట్ బ్యాంకు నుంచి ఈ నెల మూడో వారంలో రెండు రోజుల్లోనే రూ.175 కోట్ల నగదు ఆరు కరెంటు ఖాతాల నుంచి విదేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు సైబర్ పోలీసులకు (cyber crime) ఫిర్యాదు చేశారు. ఆగష్టు 24న సైబర్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు దొంగలు బయటపడ్డారు.
నిరుపేదలకు కమిషన్ ఆశ చూపి, షంషీర్గంజ్ బ్యాంకు మేనేజర్ సహకారంతో కరెంటు ఖాతాలు ప్రారంభించారు. ఆ వెంటనే నిందితులు ఆ ఖాతాల చెక్ బుక్కులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు సొమ్మును కరెంటు ఖాతాలకు అక్కడ నుంచి హవాలా మార్గాల ద్వారా దుబాయ్ తరలించారు. మరికొంత క్రిప్టో కరెన్సీ కొనుగోలు ద్వారా తరలించినట్లు సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది.
బ్యాంకు మేనేజర్ గాలి మధుబాబు సహకారంతోనే ఈ కుంభకోణం జరగడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి దుబాయ్లో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 12 మంది నిందితులను గుర్తించారు. వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.