కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన కేంద్రం, రాష్ట్రానికి రెండు ఇండస్ట్రియల్ హబ్ లు ప్రకటించింది. ఈ సాయంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటనను స్వాగతించిన చంద్రబాబు, ఏపీకి ఇదొక శుభారంభం అని అభివర్ణించారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రకటన ఊతమివ్వడంతో పాటు భరోసా కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు ఫేజ్-1 కింద ప్రాజెక్టు వ్యయం రూ.30,436.95 కోట్లు అని తెలిపిన చంద్రబాబు, దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే నాటికి రూ.4,730 కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు. దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి, మిగిలిన మొత్తాన్ని కేంద్రం భరించేట్టు అవగాహనకు వచ్చినట్లు వివరించారు.
భూసేకరణ, పునరావాసం వ్యయం మినహాయించి రూ.12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందన్నారు. 2024-25కి రూ.6 వేల కోట్లు, 2025-26కి రూ.6,157 కోట్లు కేటాయింపు ఉంటుందన్నారు.
కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లు కేటాయించడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకుముందు ప్రకటించిన మరో రెండు హబ్ లతో కలిపి ఇండస్ట్రియల్ హబ్ ల సంఖ్య నాలుగుకు చేరిందన్నారు . ఇవన్నీ పూర్తి అయితే రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.