ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న జిహాదిస్టు ఫర్హతుల్లా ఘోరీ విడుదల చేసిన ఒక వీడియోతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ భారతీయ రైల్వే నెట్వర్క్ మీద, ఇతర ప్రధాన మౌలిక సదుపాయాల మీదా దాడులు చేయాలని ఫర్హతుల్లా ఘోరీ పిలుపునిచ్చాడు. ఆ మేరకు మూడు వారాల క్రితం ఒక వీడియోను టెలిగ్రామ్ సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసాడు.
రైల్వేలపై దాడులు: ఘోరీ తన అనుచరులకు భారతీయ రైల్వే వ్యవస్థను లక్ష్యం చేసుకోమని ఆదేశాలు జారీ చేసాడు. ప్రెషర్ కుక్కర్ల వంటి వాటితో తయారుచేసే పేలుడు పదార్ధాలను ఉపయోగించి దాడులు చేయాలని వివరించాడు. రైల్వే వ్యవస్థను నాశనం చేస్తే దేశంలో అల్లకల్లోలం చెలరేగుతుందనీ, ప్రజల్లో భయం పెరుగుతుందనీ ఘోరీ వివరించాడు.
పెట్రోలియం పైప్లైన్లు, సరఫరా వ్యవస్థలు: పెట్రోలియం పైప్లైన్ల మీద, లాజిస్టిక్స్ చెయిన్స్ మీద దాడి చేస్తే సరఫరా వ్యవస్థ కుంటుపడుతుంది. దానివల్ల మౌలిక సదుపాయాల రంగం దెబ్బతింటుందని ఘోరీ వివరించాడు.
హిందూ నాయకులు, పోలీసులే లక్ష్యం: ఫర్హతుల్లా ఘోరీ తన వీడియోలో హిందూ నాయకులపైనా, చట్టాన్ని అమలుచేసే పోలీసు వ్యవస్థపైనా హింసకు పాల్పడాలని పిలుపునిచ్చాడు. అత్యంత ప్రభావశీలమైన వేర్వేరు పద్ధతుల్లో దాడులు చేయాలని సలహా ఇచ్చాడు.
భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్‌ను లక్ష్యంగా చేసుకుందని ఘోరీ ఆగ్రహం వ్యక్తం చేసాడు. వారి ఆస్తులను గుర్తించి ఈడీ, ఎన్ఐఏ ద్వారా లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డాడు. ప్రభుత్వం ప్రయత్నాలు ఎలా ఉన్నా, అంతిమ విజయం తమదేననీ, భారత ప్రభుత్వాన్ని పడగొట్టి తీరతామనీ హెచ్చరించాడు.
ఎవరీ ఫర్హతుల్లా ఘోరీ?
ఫర్హతుల్లా ఘోరీ అంతర్జాతీయ ఉగ్రవాదంలో ప్రముఖవ్యక్తి. అబూ సూఫియా, సర్దార్ సాహెబ్, ఫరూ వంటి మారుపేర్లతో చెలామణీ అవుతుంటాడు. భారతదేశంలో జరిగిన పలు ఉగ్రదాడుల వెనుక సూత్రధారి ఈ ఘోరీ.
2002లో గుజరాత్‌లోని అక్షరధామ్ ఆలయం మీద దాడికి సూత్రధారి. ఆ దాడిలో 30మందికి పైగా చనిపోయారు, 80మందికి పైగా గాయపడ్డారు. 2005లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం మీద ఆత్మాహుతి దాడి ఈ ఘోరీ వ్యూహమే. తాజాగా 2024 మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో జరిగిన పేలుడు కూడా ఫర్హతుల్లా ప్లానే. ఆ దాడిలో కనీసం పది మంది గాయపడ్డారు. ఆ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.
ఘోరీకి పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలున్నాయి. అతన్ని పట్టుకోడానికి భారత నిఘా వ్యవస్థలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి.