దేశంలోని పది రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు నిర్మించే మెగా ప్రాజెక్టుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం పలికింది. ఇవాళ దేశ రాజధానిలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆరు ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లకు అనుసంధానంగా ఆ నగరాలను నిర్మిస్తారని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం 28,602 కోట్లు కేటాయించింది.
ఆ పారిశ్రామిక ప్రదేశాల్లో ఆంధ్రలో రెండు, తెలంగాణలో ఒకటి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఓర్వకల్లు, కొప్పర్తి వద్ద, తెలంగాణలో జహీరాబాద్ వద్ద, ఉత్తరాఖండ్‌లో ఖుర్పియా వద్ద, పంజాబ్‌లో రాజ్‌పురా-పటియాలా వద్ద, మహారాష్ట్రలో దిఘీ వద్ద, కేరళలో పాలక్కాడ్ వద్ద, ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా, ప్రయాగ వద్ద, రాజస్థాన్‌లో జోధ్‌పూర్-పాలి వద్ద ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు అభివృద్ధి చేస్తారు.
12 స్మార్ట్ సిటీలు నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 10లక్షల ఉద్యోగాలు వస్తాయని కేంద్రం అంచనా వేసింది. పరోక్షంగా మరో 30లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పడతాయి. ప్లగ్ అండ్ ప్లే, వాక్ టు వర్క్ పద్ధతిలో అంతర్జాతీయ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ నిర్మాణం జరుగుతుంది.
ఈ ప్రాజెక్టు పెట్టుబడుల సామర్థ్యం సుమారు 1.52 లక్షల కోట్లు ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భారీ పరిశ్రమలతో పాటు మధ్యతరహా, చిన్న, సూక్ష్మ సంస్థలకు (ఎంఎస్ఎంఇలు) కూడా పెట్టుబడులు లభిస్తాయి. 2030 నాటికి 2లక్షల కోట్ల డాలర్ల ఎగుమతులు సాధించాలనే లక్ష్యాన్ని సాధించడంలో ఈ పారిశ్రామిక కేంద్రాలు సహాయపడతాయి.