సోషల్ మీడియాలో అనుచిత పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు తప్పదని తేల్చి చెప్పింది. ఇష్టానుసారం ఏది పడితే అది కామెంట్ చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం యోగీ సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీ- 2024 కు ఆమోదం తెలిపింది.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే ఇక నుంచి ఈ కొత్త చట్టం ప్రకారం జరిమానా, శిక్ష విధించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాల ప్రచారానికి ఈ కొత్త పాలసీ దోహదపడుతుందని యోగీ ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో సోషల్ మీడియాలో అతిపోకడలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని వివరించింది.
పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ పథకాలను క్రమం తప్పకుండా తమ ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ప్రచారం చేస్తే నెలకు రూ.8 లక్షల వరకు అందజేస్తామని పేర్కొంది.