జస్టిస్ హేమ కమిటీ నివేదికలో పలువురు మహిళలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో మళయాళ చలనచిత్ర పరిశ్రమ కుదేలైపోయింది. తన మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నటుడు, సిపిఎం ఎంఎల్ఎ ముఖేష్, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంఘంలో సభ్యత్వాన్ని తొలగించారు.
మినూ మనీర్ అనే నటి ముఖేష్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసారు. 2013లో ఒక సినిమా సెట్ మీద ముఖేష్, అతని సహనటుడు జయసూర్య తనను వేధించారని ఆమె ఆరోపించారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ – అమ్మ సంస్థలో సభ్యత్వం కోసం ముఖేష్‌ను సంప్రదించినప్పుడు అతను తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు.
మినూ మునీర్ ఆరోపణలను ఖండిస్తూ ముఖేష్ మంగళవారం ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ ఆరోపణల మీద పారదర్శకంగా విచారణ జరిపించాలని ముఖేష్ కోరారు. మినూ మునీర్ మొదట 2019లోనూ, తర్వాత 2022లోనూ తన వద్దకు వచ్చిందని చెప్పారు. మొదట ఆమె లక్ష రూపాయలు ఇమ్మని అడిగిందన్నారు. తర్వాత ఆమె భర్త మరింత ఎక్కువ మొత్తం కావాలని డిమాండ్ చేసాడని ముఖేష్ ఆరోపించారు. అయితే వాళ్ళ బ్లాక్‌మెయిలింగ్‌కు తను లొంగలేదని ఆయన ఫేస్బుక్లో రాసుకొచ్చారు.
మరోవైపు, మలయాళ సినీ పరిశ్రమలో వెల్లువెత్తుతున్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో ‘అసోసియేషన్ ఆఫ్ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్’ అధ్యక్షుడి పదవికి సీనియర్ నటుడు మోహన్‌లాల్ మంగళవారం రాజీనామా చేసారు. అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ కూడా నైతిక బాధ్యత పేరిట రాజీనామా చేసింది.
కొన్నాళ్ళ క్రితం బెంగాలీ నటి శ్రీలేఖా మిత్రా తనపై అత్యాచారం చేసారంటూ సిద్దిక్, రంజిత్ బాలకృష్ణన్‌లపై కేసు పెట్టింది. దానితో సహా మలయాళ చిత్రపరిశ్రమలో ఇప్పటివరకూ లైంగిక వేధింపుల ఆరోపణలతో నటులు, దర్శకుల మీద మొత్తం 17 కేసులు నమోదయ్యాయి.
మళయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణల మీద విచారణకు 2017లో ముగ్గురు సభ్యులతో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటు చేసారు. ఆ కమిటీ 2019లో నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఇప్పటికీ బహిర్గతం కాలేదు.