రాజ్యసభలో ఖాళీ అయిన 12 సీట్లకు జరిగిన ఉపయెన్నికల్లో అభ్యర్ధులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాటిలో 11 స్థానాల్లో ఎన్‌డిఎ అభ్యర్ధులే విజయం సాధించారు. దాంతో ఆ కూటమి రాజ్యసభలో మెజారిటీ సాధించింది. 2014లో ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో మెజారిటీ సాధించడం ఇదే మొదటిసారి.
ఈ ఎన్నికల్లో బిజెపి 9 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్‌డిఎ కూటమిలోని ఎన్‌సిపి (అజిత్ పవార్ వర్గం) ఒక స్థానాన్నీ, రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక స్థానాన్నీ గెలుచుకున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ఒక స్థానాన్ని దక్కించుకుంది.
రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉంటాయి. వాటిలో ప్రస్తుతం 8 ఖాళీగా ఉన్నాయి. వాటిలో 4 జమ్మూకశ్మీర్‌వి కాగా మరో 4 నామినేటెడ్ సీట్లు. వాటిని మినహాయిస్తే ప్రస్తుతం రాజ్యసభలో 237 సీట్లు ఉన్నాయి. అందులో మెజారిటీ సాధించడానికి 119 స్థానాలు కావాలి. తాజాగా జరిగిన ఎన్నికలతో ఎన్‌డిఎ కూటమి బలం 112కు చేరుకుంది. అదే సమయంలో ఒక స్వతంత్ర సభ్యుడు, ఆరుగురు నామినేటెడ్ సభ్యులు మొత్తం ఏడుగురు ఎన్‌డిఎకు మద్దతిస్తున్నారు. ఆ విధంగా ఎన్‌డిఎ పెద్దల సభలో మెజారిటీ మార్కును చేరుకోగలిగింది.
తాజాగా 12 స్థానాలకు జరిగిన ఉపయెన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిన్న మంగళవారంతో ముగిసింది. అప్పటికి 12 స్థానాల్లోనూ ఒక్క అభ్యర్ధే నామినేషన్ వేయడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందువల్ల ఇంక ఎన్నిక నిర్వహించవలసిన అవసరం లేదు.
బిహార్‌లో రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా, బిజెపి నాయకుడు మనన్ కుమార్ మిశ్రా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపేంద్ర కుశ్వాహా రెండేళ్ళు, మనన్ కుమార్ మిశ్రా నాలుగేళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఉంటారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్ధి జార్జి కురియన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హర్యానాలో బీజేపీకి చెందిన శ్రీమతి కిరణ్ చౌధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లో కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన కొత్త రాజ్యసభ సభ్యులకు ఆయా రాష్ట్రాల శాసనసభల కార్యదర్శులు ఎన్నికల్లో గెలిచారంటూ సర్టిఫికెట్లు అందజేసారు.
రాజ్యసభలో మెజారిటీ సాధించిన ప్రభావం ఏమిటి?
తాజా ఫలితాలతో రాజ్యసభలో ఎన్‌డిఎ బలం 11 పెరిగి 112కు చేరుకుంది. మరో ఆరుగురు నామినేటెడ్, ఒక స్వతంత్ర సభ్యులు కూడా మద్దతిస్తుండడంతో రాజ్యసభలో మెజారిటీకి కావలసిన 119 సీట్లను ఎన్‌డిఎ సాధించింది. దానివల్ల గణనీయమైన లాభంతో పాటు కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కోవలసి వస్తుంది.
రాజ్యసభలో స్పష్టమైన మెజారిటీ ఉన్నందున అధికార సంకీర్ణం చట్టాలను పాస్ చేసేటప్పుడు చిన్నచిన్న ప్రాంతీయ పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్ధుల మీద ఆధారపడే అవసరం తగ్గుతుంది. సాధారణంగా అటువంటి పార్టీల సభ్యులు అధికార పక్షానికి మద్దతు ఇవ్వాలంటే తమ డిమాండ్లు తీర్చాలంటూ మెలిక పెడుతుంటారు. అలాంటి పరిస్థితి ఇక ఉండదు. దానివల్ల పార్లమెంటు పనితీరు మరింత సమర్ధంగా ఉండగలదు. ప్రభుత్వం తన ఎజెండాను పెద్ద అడ్డంకులేమీ లేకుండా అమలు చేయగలుగుతుంది.
1989 వరకూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండేది. అప్పటికి, చాలావరకూ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండేవి కాబట్టి ఆ మెజారిటీ సాధ్యమైంది. ఆ తర్వాత సంకీర్ణ రాజకీయాల శకం వచ్చాక ప్రభుత్వాలు చిన్న, ప్రాంతీయ పార్టీల మీదనో లేక కొన్నిసందర్భాల్లో ప్రతిపక్షం మీదనో ఆధారపడాల్సి వచ్చేది. ఆ పరిస్థితి భారత పార్లమెంటరీ కార్యకలాపాల గతివిధులను మార్చివేసాయి. ఆ నేపథ్యంలో ప్రస్తుత అధికార కూటమికి రాజ్యసభలో తనదైన మెజారిటీ రావడం ఆసక్తికరమైన పరిణామం.