అర్చకుల వేతనం రూ. 10 వేలు నుంచి రూ. 15 వేలకు పెంపు
నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు
దూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.10 వేలకు పెంపు
నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3 వేలు భృతి
బలవంతపు మతమార్పిళ్ళకు అడ్డుకట్ట పడాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేవాలయాల్లో అపచారాలు జరగకూడదని ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు.
దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎక్కడా బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని ఆదేశించిన సీఎం చంద్రబాబు, ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేపట్టాలన్నారు. పటిష్టమైన చర్యల ద్వారా బలవంతపు మత మార్పిడులకు అడ్డుకట్టవేయాలని సూచించారు. దేవాలయాల్లో అన్యమతస్థులు ఉండకూడదని చెప్పారు . ఏ మతంలో అయినా భక్తుల మనోభావాల ముఖ్యమన్న చంద్రబాబు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో అదనంగా మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. రూ. 20 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం ఉంటే పాలక మండలి సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచనున్నారు. ట్రస్ట్ బోర్డులో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయీ బ్రాహ్మణుడు తప్పకుండా ఉండేలా చూస్తామని టీడీపీ ఎన్నికల్లో వాగ్దానం చేసింది. దాని అమలు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రూ. 10 వేలు వేతనం పొందే అర్చకులకు రూ. 5 వేలు పెంచి ఇకపై రూ. 15 వేలు అందజేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా 1,683 మంది లబ్ధి పొందనున్నారు. దూపదీప నైవేద్యాలకు దేవాలయాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచునున్నారు. వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ. 3 వేలు భృతి ఇవ్వాలని సీఎం సూచించారు.
నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును దేవాదాయ శాఖపరంగా గుర్తించి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.