సినీ నటి, బిజెపి ఎంపి కంగనా రనౌత్‌ను సిక్కు అతివాద వర్గాలు చంపేస్తామంటూ బెదిరించాయి. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటించి నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు ముందు ఈ బెదిరింపులు రావడం గమనార్హం.
నిహాంగ్ సిక్కు నుంచి క్రైస్తవుడిగా మతం మారిన విక్కీ థామస్ సింగ్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పెట్టాడు. అందులో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య గురించి ప్రస్తావిస్తూ పరోక్షంగా కంగనా రనౌత్‌ను బెదిరించాడు.
‘‘ఆ సినిమాలో అతన్ని (ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్ సింగ్ భింద్రన్‌వాలే) ఉగ్రవాదిగా చూపిస్తే, నువ్వు ఎవరి గురించైతే సినిమా తీసావో ఆ వ్యక్తికి (ఇందిరాగాంధీకి) ఏమయిందో గుర్తుందిగా. సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఎవరు? సంత్జీ కోసం మేం మా తలైనా ఇచ్చేస్తాం. తల ఇచ్చే ధైర్యం ఉన్నవారు, ఎదుటివారి తల సైతం నరకగలరు’’ అంటూ వీడియోలో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అలా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో కంగనా రనౌత్ పోలీసుల సహాయం అర్ధించారు. సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు ఇందిరాగాంధీ బాడీగార్డులు, వారే ఆమెను 1984 అక్టోబర్ 31న హతమార్చారు.
‘‘ఈ సినిమా కనుక విడుదల చేస్తే సర్దార్లు అందరూ నిన్ను చెప్పులతో కొడతారు. నాకు నా దేశం మీద విశ్వాసం ఉంది. నేను భారతీయుణ్ణని గర్వంగా చెప్పుకుంటాను. నిన్ను ఈ దేశంలో ఎక్కడైనా చూస్తే, ముఖ్యంగా నువ్వు కనుక మహారాష్ట్రలో కనిపిస్తే మేము మా హిందూ క్రైస్తవ ముస్లిం సోదరులతో కలిసి నీకు చెప్పులతో స్వాగతం చెబుతాము’’ అని ఆ వ్యక్తి ఆ వీడియోలో హెచ్చరించాడు.
కంగనా రనౌత్ ఆ వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేసి హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల పోలీసు విభాగాలను ట్యాగ్ చేసారు. ఆ విషయంలో దర్యాప్తు చేయవలసిందిగా అర్ధించారు. విక్కీ థామస్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన మరో వీడియోలో కంగనా రనౌత్‌ను అభ్యంతరకరంగా దూషించాడు. ఎమర్జెన్సీ చిత్రం దర్శక నిర్మాతలు, నటీనటులను హెచ్చరించాడు.
‘ఎమర్జెన్సీ’ అనేది కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన సినిమా. 1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి గురించి ఆ సినిమాలో చర్చించారు. స్వయంగా కంగనాయే ఇందిరాగాంధీ పాత్రను పోషించారు. అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌధురి, శ్రేయస్ తల్పడే, విశాఖ్ నాయర్, సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. ఆ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఆ సినిమాలో సిక్కులను చెడ్డగా చూపించి ఉంటారని ఆరోపిస్తూ సిక్కు సంస్థలు సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ భింద్రన్‌వాలేను అమరవీరుడిగా పేర్కొంటూ, ఆ సినిమాను నిషేధించాలని పిలుపునిచ్చింది.