తిరుపతి సమీపంలోని నాగలాపురంలో టీటీడీ భూమి రెండు ఎకరాలను కొందరు కబ్జా చేసారు. రెవెన్యూ విభాగంలో మాజీ వీఆర్వోలు, వైసీపీ మాజీ ఎంపీటిసి, మరికొందరు స్థానికులు కబ్జా చేసారని ఆ గ్రామానికి చెందిన జె శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు.
ప్రజల విజ్ఞప్తులు, ఫిర్యాదులను స్వీకరించడానికి బిజెపి నిర్వహిస్తున్న ‘వారధి’ కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆయనకు శ్రీనివాసరావు ఈ ఫిర్యాదు అందజేసారు. అందులో ఉన్న వివరాల ప్రకారం…. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో పని చేసి రిటైరైన చింతల మునిరత్నం, అతని కుమారుడు చింతల కృష్ణ నకిలీ పత్రాలు సృష్టించి నాగలాపురం బజారు వీధిలో 200 అడుగుల పొడవు దారిని కబ్జా చేసారు. దాంతోపాటే తమ భూమిని కబ్జా చేసారని, తమ బావిని సైతం పూడ్చివేసారనీ శ్రీనివాసరావు ఆరోపించారు. అప్పటి కలెక్టరు భరత్ గుప్తాకి అన్ని ఆధారాలతో సమర్పించినా పట్టించుకోలేదనీ, తరువాత వచ్చిన కలెక్టరు వెంకటరమణ రెడ్డి, జాయింట్ కలెక్టరు డీకే బాలాజీ గారికి సమర్పించినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా పట్టించుకోలేదని వాపోయారు.
ప్రభుత్వ భూములను, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కబ్జా చేసిన వారి మీద, వారికి సహకరించిన అధికారుల మీద క్రిమినల్ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాది కోరారు.