తమిళనాడులోని నాస్తిక ద్రవిడ ప్రభుత్వం హిందువులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా పళని పట్టణంలో రెండు రోజుల అంతర్జాతీయ ముత్తమిళ్ మురుగన్ కాన్ఫరెన్స్ నిర్వహించింది.
పళని పట్టణాన్ని తిరువావినంకుడి అని కూడా పిలుస్తారు. కుమారస్వామి లేదా మురుగన్ అని పిలిచే సుబ్రహ్మణ్య స్వామి కోవెల ఉన్న ప్రసిద్ధ పట్టణమది. కొండ మీద ఉన్న ఆ గుడిని భోగార్ అనే సాధువు నిర్మించారు. ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన ఆ ఆలయంలో కోరుకున్న కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం.
ఇంతకీ ఇప్పటికిప్పుడు డిఎంకె ప్రభుత్వానికి మురుగన్ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? గత సెప్టెంబర్‌లో ఒక యూట్యూబర్ స్వామి మురుగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఇదే ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదు. ఈ ముఖ్యమంత్రి కొడుకే అయిన క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేసాడు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనే అజెండాతో పెట్టిన సమావేశానికి ఉదయనిధితో కలిసి హాజరైన తమిళనాడు దేవదాయ శాఖ మంత్రే ఈ అంతర్జాతీయ మురుగన్ సదస్సును నిర్వహించాడు.
డిఎంకె నేతల హిందూ వ్యతిరేకత అందరికీ తెలిసిందే. పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి ఒకసారి తమ పార్టీ ఎంపీ ఒకరు నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటే దెబ్బ తగిలి రక్తం కారుతోందా అని అడిగాడు. సేతుసముద్రం ప్రాజెక్టు వివాదం సమయంలో, రాముడేమైనా ఇంజనీరా అని అడిగిన ఘనుడు కరుణానిధి. వినాయక చవితి నాడు గణపతి విగ్రహాల ఊరేగింపును, నిమజ్జనాలనూ డిఎంకె ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకొంటూనే ఉండేది. అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్ఠ రోజు తమిళనాడులో ఎటువంటి ప్రత్యేక పూజలూ జరగకుండా అడ్డుపడినది స్టాలిన్ ప్రభుత్వమే.
ఈ పార్టీ నాయకులు ముస్లిం, క్రైస్తవ కార్యక్రమాలకు హాజరవడానికి మాత్రం ముందుంటారు. ఇఫ్తార్ పార్టీలు నిర్వహిస్తారు. ఒకసారి ఒక ముస్లిం సమావేశంలో స్టాలిన్ హిందువుల వివాహ సంప్రదాయాలను అవహేళన చేస్తూ మాట్లాడాడు. స్టాలిన్ ఎప్పుడూ హిందూ ఆలయాలను సందర్శించలేదు. ప్రసాదం, పూర్ణకుంభం, విభూతి తీసుకోలేదు. ఒక నాయకుడి స్మారక సమావేశంలో విభూతి ఇచ్చినప్పుడు దాన్ని కింద పడేసాడు. హిందువుల పండుగలకు ఎప్పుడూ హిందువులకు శుభాకాంక్షలు చెప్పని ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వం. క్రైస్తవ, ముస్లిం పండుగలకు మాత్రం డిఎంకె నాయకులందరూ వరుసలు కట్టి మరీ శుభాకాంక్షలు చెబుతారు.
అలాంటి నేపథ్యంలో, డిఎంకె ప్రభుత్వం పళని కుమారస్వామి దేవాలయ క్షేత్రంలో రెండు రోజుల సదస్సు నిర్వహించడం విశేషమే. తమ ప్రభుత్వం మీద పడిన ‘హిందూ వ్యతిరేక’ ముద్రను తొలగించుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటు చేసిందని ఇట్టే అర్ధమవుతోంది.
తమను తాము హేతువాదులుగా చెప్పుకునే డిఎంకె నేతలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కనిపిస్తున్న ఒకే ఒక కారణం, తమిళనాట ఇటీవల బలమైన శక్తిగా ఎదుగుతున్న బీజేపీని అడ్డుకోవాలని చేసే ప్రయత్నమే. ఆ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు అన్నామలై నాయకత్వంలో బీజేపీ ఓట్‌షేర్ 18శాతం కంటె ఎక్కువ నమోదయింది. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ ‘వేల్ యాత్ర’ నిర్వహించారు. దానికి జనాదరణ లభించింది.
ఆ నేపథ్యంలో మొన్నటి శని, ఆదివారాల్లో రెండు రోజుల అంతర్జాతీయ ముత్తమిళ్ మురుగన్ సదస్సును ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వర్చువల్‌గా ప్రారంభించారు. తమ ప్రభుత్వం, ప్రజలు వ్యక్తిగతంగా నమ్మే విశ్వాసాలను ఎంచుకునే స్వేచ్ఛకు అనుకూలమని స్టాలిన్ వర్గం చాటుతోంది. అంతేకాక, తమ ధార్మిక అన్వేషణల్లో సహకరించాలనీ కోరుకుంటోంది.
ఆ సదస్సు అప్పటికప్పుడు నిర్ణయించుకున్నది కాదు. ప్రభుత్వం వారి హిందూ ధార్మిక, దాతృత్వ, దేవదాయ విభాగం సుదీర్ఘకాలంగా చేసుకుంటూ వచ్చిన అభివృద్ధి పనుల ఫలితమే ఆ సదస్సు నిర్వహణ. తుగ్లక్ పత్రిక సంపాదకుడు చో రామస్వామి డిఎంకె గురించి ‘‘అవసరం పడితే డిఎంకె చివరికి కావడి కూడా ఎత్తుకుంటుంది’’ అనేవాడు. స్టాలిన్ సర్కారు ఆ మాటను నిజం చేసింది. ‘హేతువాద’ డిఎంకె ప్రభుత్వం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఆ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల నుంచి 2వేల మందిని ఆహ్వానించారు.
ఈ సదస్సు గురించి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తన ‘ఎక్స్’ ఖాతాలో ‘‘గతేడాది వాళ్ళు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ ప్రేలాపనలు పేలారు. ఈ యేడాది వాళ్ళే స్వామి మురుగన్‌కు గొప్ప వేడుక చేస్తున్నారు. ఆ రెండు కార్యక్రమాల్లోనూ దేవదాయ మంత్రి శేఖర్ బాబు పాల్గొన్నారు. ప్రజల ఆగ్రహాన్ని గ్రహించిన వెంటనే డిఎంకె తన చేతిలో ఉన్న రాతను మార్చేస్తుంది. కానీ ఒకటి మరచిపోకండి, ఈ నాటకం అంతటినీ స్వామి మురుగన్ చూస్తూనే ఉన్నారు’’ అని రాసుకొచ్చారు.
ఆ కార్యక్రమానికి స్టాలిన్ వ్యక్తిగతంగా హాజరవకపోవడానికి కారణమేంటని బిజెపి మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ నిలదీసారు. ఇప్పుడు హిందూ ధార్మిక కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఏంటంటూనే, ఆ కార్యక్రమానికి స్టాలిన్, ఉదయనిధి హాజరవకపోవడం ద్వారా హిందూ ధర్మంపై తాము చూపేది కపట ప్రేమ మాత్రమేనని తేలిపోయిందన్నారు.
మరోవైపు డిఎంకె మిత్రపక్షాలైన విసికె, సిపిఎం, సిపిఐ పార్టీలు మురుగన్ సదస్సు నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని నిందించాయి. ఇలాంటి సదస్సులు తమిళ లౌకిక ఉనికికి బలమే లేకుండా చేస్తాయని ఆరోపించాయి.