కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యాపారాలు పెద్దస్థాయిలో జరిగాయి. ఆ రోజు జరిగిన వాణిజ్య కార్యకలాపాల విలువ రూ.25వేల కోట్ల కంటె ఎక్కువేనని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ – సీఏఐటీ వెల్లడించింది. పండుగల సమయాల్లో ప్రజల కొనుగోళ్ళు ఎంతలా పెరుగుతాయన్న విషయాన్ని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. సంవత్సరంలో ఎక్కువ వ్యాపారం జరిగే సమయాల్లో కృష్ణాష్టమి ఒకటని తేలింది.
చాందినీచౌక్ ఎంపీ, సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ దీనిగురించి వివరించారు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండుగల్లో కృష్ణాష్టమి ప్రధానమైనది. ఆ పండుగ సందర్భంగా పెద్దస్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నమోదయ్యాయి. ప్రత్యేకించి పూలు, పండ్లు, మిఠాయిలు, దుస్తులు, అలంకరణ సామగ్రి, పాలు, పెరుగు, వెన్న, డ్రై-ఫ్రూట్స్ అమ్మకాలు బాగా పెరిగాయి. పండుగల వేళ జరిగే ఇలాంటి వాణిజ్య కార్యకలాపాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తాయని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ విశ్లేషించారు.
కృష్ణాష్టమి ఈ యేడాది ఆగస్టు 26న వచ్చింది. ఆ రోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. గుడులను, ఇళ్ళను పూలు, దీపాలతో అలంకరిస్తారు. భక్తులు పెద్దసంఖ్యలో దేవాలయాలను సందర్శించారు. ఉట్టికొట్టడం వంటి పలు రకాల వేడుకల్లో పాలు పంచుకున్నారు. పండుగ వేడుకలు కొన్నిచోట్ల ఆధునిక శోభ సంతరించుకున్నాయి. డిజిటల్ శకటాలు ఏర్పాటు చేసారు. కృష్ణుడితో సెల్ఫీ తీసుకునే పాయింట్లు వెలిసాయి.
కృష్ణాష్టమికి ఎనిమిది రోజుల ముందు, అంటే శ్రావణ పూర్ణిమ రాఖీ పర్వదినం నాడు దేశవ్యాప్తంగా 12వేల కోట్ల వ్యాపారం జరిగిందని సీఏఐటీ అంచనా వేసింది.