కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వైద్య విద్యార్ధిని అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి సంబంధించిన మరికొన్ని వివరాలు బైటపడ్డాయి. నిందితుడు సంజయ్ రాయ్ ఉపయోగించిన మోటార్ సైకిల్, కోల్కతా పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్టర్ అయి ఉంది.
సంజయ్ రాయ్ కోల్కతా పోలీసు విభాగంలో సివిక్ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఆ నేరం జరిగిన రోజు అతను కమిషనర్ పేరిట రిజిస్టర్ అయి ఉన్న వాహనాన్ని వినియోగించాడు. ఆ బండి మీద సంజయ్ రాయ్ కోల్కతా ఉత్తర భాగంలోని రెడ్లైట్ ప్రాంతాలను చుట్టబట్టేవాడు. దాన్నిబట్టే కోల్కతా పోలీసుల నిర్లక్ష్యం, జవాబుదారీతనం లేకపోవడం గురించి అర్ధమవుతుంది. సంఘటన జరిగిన రోజు సంజయ్ రాయ్ మద్యం మత్తులో ఉండగానే ఆ వాహనం మీద 15 కిలోమీటర్లు ప్రయాణం చేసాడు. దాన్నిబట్టి, సివిక్ వాలంటీర్ల మీద పోలీసుల పర్యవేక్షణలో లోపాలు ఎంతలా ఉన్నాయో అర్ధమవుతుంది.
ఆ మోటార్ సైకిల్ పదేళ్ళ క్రితం రిజిస్టర్ చేసినది. సిబిఐ ఈ కేసు విచారణలో భాగంగా ఆ వాహనాన్ని జప్తు చేసింది. నగర పోలీస్ కమిషనర్ పేరు మీద రిజిస్టరై ఉన్న బండినే సిబిఐ అధికారులు జప్తు చేసారు. సిబిఐలోని కొన్ని వర్గాలు చెప్పడం ఏంటంటే… సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్కీ, నగర పోలీసులతో ఉన్న ఆ సాన్నిహిత్యం వల్లనే ఈ హీనమైన నేరం చేసేందుకు అతన్ని పురిగొల్పిందన్న విశ్లేషణ కూడా వినవస్తోంది. ఇప్పుడు సిబిఐ తన దర్యాప్తు పరిధిని పెంచుతోంది. అలా ఆ ఘోరంలో ఊహించినదానికంటె ఎక్కువమంది ప్రమేయం ఉందేమో వెల్లడి కావచ్చు. అలాగే, ఉన్నతస్థాయి అధికారులకు ఉండే వెసులుబాట్లు సంజయ్రాయ్కి ఎలా లభించాయో కూడా తెలిసే అవకాశం ఉంది.