ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బిఆర్ గగాయ్, జస్టిస్ విశ్వనాథన్‌ల ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘంగా వాదనలు విన్న తరవాత కవితకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు. కవిత కేసులో సీబీఐ చార్జిషీట దాఖలు చేసింది. ఈడీ కూడా విచారణ పూర్తి చేసింది. ఇక కవితను జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ( brs mlc kavita) ప్రధాన సూత్రధారిగా ఉన్నారంటూ ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదని కవిత తరపు న్యాయవాది రోహత్గి వాదనలు వినిపించారు. మద్యం కేసు నమోదు చేసిన తరవాత సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు అనేక ఫోన్లు నాశనం చేశారంటూ ఏఎస్జీ చేసిన వాదనలు నిలవలేదు. ఒక మహిళగా కూడా కవితకు బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. ఒక్కో కేసుకు రూ.10 లక్షల పూచీకత్తు, పాస్ పోర్టు పోలీసులకు అప్పగించాలని కోర్టు షరతులు విధించింది.