ఇటీవల ప్రకృతివిలయానికి గురైన కేరళలోని వయనాడ్ ప్రాంతంలో సహాయ పునరావాస చర్యలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.10కోట్ల విరాళం ప్రకటించింది. ఆ విషయాన్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ వెల్లడించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను స్వయంగా ఆయనే సహాయం అర్ధించారు.
గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు యోగి ఆదిత్యనాథ్ లేఖ రాసారు. అందులో, కొండచరియలు విరిగిపడడం వల్ల బాధితులైన కేరళ ప్రజలకు తమ ప్రభుత్వం, యూపీ ప్రజల తరఫున సానుభూతి వ్యక్తం చేసారు. కేరళ ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస కార్యకలాపాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.10కోట్లు విరాళంగా అందజేస్తోందని ఆ లేఖలో యోగి ఆదిత్యనాథ్ రాసారు. ఈ కష్టకాలంలో కేరళ ప్రజలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.
ఈ యేడాది జులై 30న వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు తీవ్ర విధ్వంసం కలగజేసాయి. ప్రత్యేకించి ముండక్కై, చూరళ్‌మల గ్రామాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. 231మంది చనిపోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా కనీసం 119మంది ఆచూకీ తెలియలేదు. ఆ విధ్వంసం వేలాదిమంది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రాణ, ధన నష్టంతో వేల కుటుంబాలు నాశనమైపోయాయి.
వయనాడ్ విలయంతో కుదేలైపోయిన కేరళకు దేశం అంతటినుంచీ సహాయం అందుతోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.20కోట్లు ఆర్ధిక సహాయం అందించింది. ఆంధ్రప్రదేశ్ రూ.10కోట్లు, తమిళనాడు రూ.5కోట్లు సహాయం అందజేసాయి. మహారాష్ట్ర రూ.10కోట్ల విరాళం ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం 100 ఇళ్ళు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది.