ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జెఎంఎం పార్టీ సీనియర్ నాయకుడు చంపయి సోరెన్ భారతీయ జనతా పార్టీలో చేరతారు. ఆగస్టు 30న రాంచీలో జరిగే ఓ కార్యక్రమంలో చంపయి సోరెన్ కమలతీర్థం స్వీకరిస్తారు.
ఆ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన ‘ఎక్స్’ మాధ్యమంలో ట్వీట్ చేసారు. ‘‘ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మన దేశంలోని ఒక గొప్ప ఆదివాసీ నాయకుడు అయిన చంపయి సోరెన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆయన ఆగస్టు 30న రాంచీలో జరిగే ఒక కార్యక్రమంలో బీజేపీలో చేరతారు’’ అని హిమంత బిశ్వ శర్మ రాసుకొచ్చారు.
అంతకుముందు, చంపయి సోరెన్ కొత్త పార్టీ ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు సంకేతాలిచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనను అవమానించారని, త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అన్ని రకాల అవకాశాలూ తెరుచుకునే ఉంటాయనీ చంపయి సోరెన్ ట్వీట్ చేసారు.
హేమంత్ సోరెన్ కటకటాల వెనక్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంపయి సోరెన్, ఆ సమయంలో తనను అవమానించారని ఆరోపించారు. లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించనివ్వలేదనీ, ఉన్నట్టుండి సీఎం పదవికి రాజీనామా చేయించారనీ, అటువంటి చర్యల ద్వారా తాను ప్రత్యామ్నాయ మార్గం చూసుకొనే పరిస్థితులు కల్పించారనీ, సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా చంపయి సోరెన్ వెల్లడించారు.
ఝార్ఖండ్లో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో చంపయి సోరెన్ చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఈ యేడాది జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో, చంపయి సోరెన్ బీజేపీలో చేరిక, గుణాత్మక ప్రభావం చూపే అవకాశముంది.