గడచిన ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం చేపట్టిన విచారణ చివరి దశకు చేరింది. తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. తిరుమల (tirumala tirupati devastanam) నిధులను నిబంధనలకు విరుద్దంగా రోడ్ల నిర్మాణాలకు మళ్లించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా తాఖీదులు జారీ చేశారు. గోవిందరాజుల సత్రాలను కూల్చివేసి కొత్తగా నిర్మించేందుకు పిలిచిన టెండర్లలోనూ అక్రమాలు వెలుగు చూశాయి. టీటీడీ ప్రధాన అకౌంట్స్ అధికారికి కూడా నోటీసులు జారీ అయ్యాయి.
బర్డ్ ఆసుపత్రి నియామకాల్లోనూ ధర్మారెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. టీటీడీ ఈవోతోపాటు, బర్డ్ ఆసుపత్రికి డైరెక్టర్‌గా ధర్మారెడ్డి పనిచేశారు. వందలాది మందిని అక్రమంగా బర్డ్ ఆసుపత్రిలో నియమించినట్లు ఏసీబీ గుర్తించింది. దీనిపై కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.
శ్రీవాణి ట్రస్టుకు వచ్చే విరాళాలను కొత్త ఆలయాల నిర్మాణాలకు ఉపయోగించాల్సి ఉంది. అయితే నిబంధనలకు విరుద్దంగా రోడ్ల నిర్మాణాలకు నిధులు మళ్లించారని విచారణలో తేలింది. సత్రాల కూల్చివేతలకు అనుమతులు కూడా తీసుకోకుండానే వాటిని కూల్చివేయడంపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. వీటిపై కూడా ఏసీబీ ఇప్పటికే విచారణ జరిపింది.