త్రిపురలోని దుర్గానగర్ గ్రామంలో కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన ఆ సంఘటన తర్వాత రెండు తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దాంతో సోమవారం నుంచి రేపు బుధవారం వరకూ కర్ఫ్యూ విధించారు.
రాష్ట్రప్రభుత్వ వర్గాలు చెప్పిన వివరాల మేరకు… పశ్చిమ త్రిపుర జిల్లా జిరానియా సబ్‌డివిజన్ దుర్గానగర్‌లో ఆదివారం నాడు కొందరు గుర్తు తెలియని దుండగులు కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసారు. దాంతో ఆగ్రహానికి గురైన ఒక వర్గం ప్రజలు గ్రామంలో బీభత్సం సృష్టించారు. పలు భవనాలకు నిప్పు పెట్టారు. కొన్ని కార్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలను అక్కడికి పంపించారు. స్థానిక ఎంఎల్ఎ, రాష్ట్ర మంత్రి సుశాంత చౌధురి ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి వారిని శాంతపరిచారు. క్రమంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. మొత్తం మీద పన్నెండు ఇళ్ళపై దాడి జరిగింది. కొన్ని పశువులు సైతం గాయపడ్డాయి.
‘‘ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది. తాజాగా ఎటువంటి గొడవలూ జరగలేదు. ఆ ప్రాంతం అంతటా భద్రతా బలగాలను మోహరించాము’’ అని పోలీస్ అధికారి వివరించారు.
పశ్చిమ త్రిపుర జిల్లా కలెక్టర్ డాక్టర్ విశాల్ కుమార్ జిరానియా సబ్‌డివిజన్‌లో కర్ఫ్యూ విధించారు. సోమవారం నుంచి బుధవారం వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కర్ఫ్యూను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి ప్రకటించారు.