కర్ణాటక కొప్పాళ జిల్లా గంగావతి పట్టణంలో ఇటీవల కొత్తగా వీధిదీపాలు అమర్చారు. అయితే ఎస్‌డిపిఐ స్థానిక శాఖ ఆ దీపాలు మతసామరస్యానికి భంగకరమని ఆరోపిస్తూ వాటిని తొలగించాలని డిమాండ్ చేసింది.
కర్ణాటక రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ ఇటీవల గంగావతి పట్టణంలో వీధిదీపాలు అమర్చారు. అవి అయోధ్య, తిరుమలలో అమర్చిన వీధిదీపాల తరహాలో ఉన్నాయి. దాంతో అవి లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉన్నాయని, వాటివల్ల మతసామరస్యానికి భంగం వాటిల్లుతోందనీ ముస్లిం పార్టీ అయిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వివాదం రగిల్చింది.
గంగావతి తాలూకాలో హనుమంతుడి జన్మస్థానంగా భావించే అంజనాద్రి ఉంది. ఆ ప్రాంతానికి ఆధ్యాత్మికంగానూ, సాంస్కృతికంగానూ ప్రాధాన్యం ఉంది. అలాంటి గంగావతిలో రెండు ప్రధాన కూడళ్ళలో జులై నెలలో వీధిదీపాలు అమర్చారు. ఆ దీపాల స్తంభాలు అయోధ్య, తిరుపతిల్లో దీపస్తంభాల నమూనాలో ఉన్నాయి. వాటి మీద హిందూ ఆధ్యాత్మిక చిహ్నాలు ఉన్నాయి. ఒకవైపు గద, మరోవైపు ధనుస్సు, మధ్యలో వెంకటేశ్వరస్వామి తిరునామం ఉన్నాయి.
ఎస్‌డిపిఐ గంగావతి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీ ఆ దీపస్తంభాలను తొలగించాలంటూ ఫిర్యాదు చేసాడు. అవి అనవసరంగా ఇతర మతస్తులను రెచ్చగొడతాయని, ఆ ప్రదేశంలోని మత సామరస్యాన్ని దెబ్బతీస్తాయనీ ఆరోపించాడు.
నిజానికి వీధిదీపాలపై అటువంటి చిహ్నాల ఏర్పాటును స్థానిక సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా చూడాలి తప్ప మతసామరస్యానికి విఘాతం అన్న ధోరణిలో చూడకూడదని స్థానికులు భావిస్తున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ మౌలికవసతుల మీద ధార్మిక చిహ్నాలను అమర్చడం సర్వసాధారణం. ఈ దేశపు వైవిధ్యభరితమైన ఆధ్యాత్మికతను అవి ప్రతిబింబిస్తాయి. ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే చిహ్నాలను తొలగించాలన్న డిమాండే నిజానికి ఈ దేశపు లౌకిక తత్వానికి విరుద్ధం అని స్థానికులు ఎస్‌డిపిఐ డిమాండ్‌ను తప్పుపడుతున్నారు. గంగావతి మునిసిపల్ కౌన్సిల్ ఈ విషయంలో గట్టిగా నిలబడాలని, ఎస్‌డిపిఐ ఒత్తిళ్ళకు లొంగిపోకూడదనీ హిందూ సంస్థలు కోరుతున్నాయి.
వీధిదీపాల ఏర్పాటు సహా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆలయాల నిధులను ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయి. పైగా, హిందువులకు లబ్ధి చేకూర్చడానికే ఆలయాల నిధులను వినియోగిస్తున్నామంటూ సమర్ధించుకుంటున్నాయి. అలాంటప్పుడు దీపస్తంభాలపై ధార్మిక చిహ్నాలను అలంకరిస్తే తప్పేమిటి అని హిందువులు అడుగుతున్నారు.
‘‘అయోధ్యను ప్రతీరోజూ లక్షల మంది సందర్శిస్తున్నారు. అక్కడ మతపరమైన ఉద్రిక్తతలు లేవు. అలాంటప్పుడు గంగావతి లాంటి చిన్న పట్టణంలో ఉద్రిక్తతలు దేనికి? ప్రతీరోజూ తెల్లవారుజామునే మసీదుల నుంచి వచ్చే అజాన్‌ను హిందువులు సహిస్తున్నారు. దానిగురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు కదా. అలాంటప్పుడు వీధి దీపాల డిజైన్లతో మతసామరస్యం ఎలా చెడుతుంది?’’ అని స్థానిక బజరంగ్‌దళ్ నాయకుడు బసవరాజప్ప ప్రశ్నించారు.
నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐ అనుబంధ పార్టీ అయిన ఎస్‌డిపిఐ, హిందువులకు సంబంధించిన ప్రతీదాన్నీ తప్పు పట్టడం, వ్యతిరేకించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. దానికి మత సామరస్యం అనే ముసుగు తొడుగుతోంది. అటువంటి వేర్పాటువాద ముస్లిం గ్రూపులు లౌకికవాదం పేరిట తరచుగా తమ చర్యలను సమర్ధించుకుంటూ హిందువుల ప్రతీ చిన్న చర్యనూ అడ్డుకుంటున్నాయి. హిందూ భక్తిగీతాలను, హిందువుల పండుగలను నిలువరిస్తున్నాయి. ఇస్లామేతరుల ప్రతీ చర్య మీదా దాడి చేస్తున్నాయి. మతపరమైన అసహనాన్ని తాము ప్రదర్శిస్తూ ఎదుటివారి మీద ఆరోపణలు చేస్తున్నాయి. భారతదేశపు సంస్కృతిని దెబ్బతీయడానికి అలాంటి సంస్థలు గతంలోలా రహస్యంగా కాకుండా బహిరంగంగానే పనిచేస్తున్నాయి. అలాంటి చర్యే ఇప్పుడు ఈ వీధిదీపాలపై ఎస్‌డిపిఐ చేస్తున్న అనవసరపు రాద్ధాంతం.