ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో 25మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వారిలో ఐదుగురి మీద రూ.28లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
బిజాపూర్ జిల్లా ఎస్‌పి జితేంద్ర కుమార్ యాదవ్ చెప్పిన వివరాల ప్రకారం… శంబటి మద్కం, జ్యోతి పూనెం అనే ఇద్దరు మహిళా నాయకులు, మహేష్ తేలం, విష్ణు కర్తం, జైదేవ్ పొడియం అనే ముగ్గురు నాయకులు… మొత్తం ఐదుగురు మావోయిస్టుల తలలపై రివార్డులున్నాయి. శంబటి మద్కం, జ్యోతి పూనెం, మహేష్ తేలం ఒక్కొక్కరి తల మీదా రూ. 8 లక్షల రివార్డు ఉంది. మిగతా ఇద్దరి తలలకూ చెరి రెండు లక్షల వెల ఉంది. వారితో పాటు మరో 20 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు.
ఉద్యమ నేతల దౌర్జన్యాలు, మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ కారణంగానే వారు లొంగిపోయారని ఎస్‌పి జితేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు. లొంగిపోయినవారికి పునరావాసం కల్పిస్తామని, ఒక్కొక్కరికీ రూ.25వేలు ఆర్థిక సహాయం చేస్తామనీ వివరించారు. ఈ యేడాది ఇప్పటివరకూ 346మంది మావోయిస్టులను అరెస్ట్ చేసామని, 170 మంది లొంగిపోయారనీ ఎస్‌పి చెప్పుకొచ్చారు.