పాఠశాలలు క్షేత్రస్థాయిలో భౌగోళికంగానూ, సామాజికంగానూ విస్తరించాలని విద్యాభారతి అఖిల భారత కార్యకారిణీ సదస్యులు జె.ఎం. కాశీపతి సూచించారు. వివిధ రాష్ట్రాలలోని జిల్లాలు, మండలాలు, మరింత కింది స్థాయికి కూడా శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలు విస్తరించాలని సూచించారు. విద్యాపీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్కార కేంద్రాలు, తీరప్రాంతాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాల వల్ల సమాజంలో గుణాత్మక పరివర్తన కనిపిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బండ్లగూడలోని శారదాధామంలో రెండురోజుల పాటు విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర సమితి సాధారణ సభా బైఠక్లు జరిగాయి. శనివారం, ఆదివారం జరిగిన ఈ సమావేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల విద్యాభారతి పాలక మండలి బాధ్యులు, విషయ ప్రముఖులు హాజరయ్యారు. విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో సశక్తీకరణ, విస్తరణ, వికాసం, కార్యాచరణ యోజన మీద దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. పాఠశాల కేంద్రంగానే మంచిపోకడలకు శ్రీకారం చుట్టాలన్నారు. కార్యకర్తలందరూ విస్తృతంగా పర్యటనలు చేయాలన్నారు. విద్యాపీఠం పని పాఠశాలల నిర్వహణ మాత్రమే కాదని, సమాజ అవసరాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వాటిని తీర్చాలనీ అన్నారు. ఆచార్యులు తమ విషయాలను బోధిస్తూనే మన సంప్రదాయ విషయాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలన్నారు. దానివల్ల విద్యార్థులకు సంస్కృతిపైన కూడా అవగాహన కలుగుతుందని వివరించారు. అన్ని పాఠశాలల్లోనూ ప్రభుత్వపరంగా వస్తున్న సంప్రదాయాలను గౌరవించాలని పేర్కొన్నారు.
విద్యా భారతి క్షేత్ర కార్యదర్శి అయాచితుల లక్ష్మణరావు, క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ వివిధ విభాగాల పురోగతిని సమీక్షించారు. ఇక విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమామహేశ్వర రావు పంచ పరివర్తన్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షులు ప్రొ. తిరుపతిరావు, రాయలసీమ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, కర్ణాటక అధ్యక్షులు పరమేశ్వ హెగ్డే మార్గదర్శనం చేశారు. మూడు రాష్ట్రాల సంఘటన మంత్రులు పతకమూరి శ్రీనివాస రావు, కన్నా భాస్కర్, ఉమేష్ సమన్వయం చేశారు.
విద్యాభారతి దేశ వ్యాప్తంగా 25 వేలకు పైగా పాఠశాలలు నిర్వహిస్తున్నది. అఖిల భారత స్థాయి నుంచి వచ్చిన సూచనలు, వివిధ విద్యా విషయక అంశాల మీద కూడా సమాలోచనలు నిర్వహించారు.