(నేడు విశ్వహిందూ పరిషద్ వ్యవస్థాపక దినం)
భారతదేశంలోనే కాక విదేశాల్లో సైతం వ్యాపించి ఉన్న కోట్లాది హిందువుల హృదయాల్లో విశ్వహిందూ పరిషద్ (విహెచ్పి)కి ఒక స్థానం ఉంది. అయోధ్యలో రామమందిర నిర్మాణ ఉద్యమానికి విహెచ్పి నాయకత్వం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అటువంటి హిందూ సాంస్కృతిక సంస్థ విశ్వహిందూ పరిషద్ వ్యవస్థాపక దినోత్సవం ఇవాళే.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రెండవ సర్సంఘచాలక్ మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ (గురూజీ) ప్రేరణతో, స్ఫూర్తితో విశ్వహిందూ పరిషద్ సంస్థ 1964లో కృష్ణాష్టమి రోజు (ఆగస్టు 29) ముంబైలో ఆవిర్భవించింది.
ఇవాళ విశ్వహిందూ పరిషద్ పరిశ్రమ దేశ సరిహద్దులు దాటింది. 50కి పైగా దేశాల్లో విహెచ్పి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రామమందిర ఉద్యమం విజయవంతంగా ముగిసాక విశ్వహిందూ పరిషద్ తన దృష్టిని గోవధపై దేశవ్యాప్త నిషేధం, మతమార్పిడుల నిరోధం, లవ్‌జిహాద్ మీద పోరాటం… వంటి అంశాల వైపు సారించింది. దేశంలోని ప్రతీ పంచాయతీలోనూ కమిటీలు, ప్రతీ మండలంలోనూ సేవాకేంద్రాలూ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. విహెచ్పి ప్రయత్నాల ద్వారా సుమారు 63 లక్షల మంది హిందువులను మతం మారకుండా నిలువరించగలిగింది, సుమారు 9 లక్షల మందిని మళ్ళీ స్వధర్మంలోకి తీసుకురాగలిగింది.
చారిత్రక సందర్భం, ప్రయోజనం:
విశ్వహిందూ పరిషద్ మూలాలు 1925 నాటికే ఉన్నాయి. అప్పుడే డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గేవార్ సమాజాన్ని ఐకమత్యంగా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించారు. ఆర్ఎస్ఎస్ అంకితభావం కలిగిన కార్యకర్తలను సృష్టించుకోగలిగింది. భారతదేశం 1947లో రాజకీయ స్వతంత్రం సాధించింది కానీ సాంస్కృతిక స్వతంత్రం ఎండమావిగానే మిగిలిపోయింది. హిందూ సమాజం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటోంది. దాని ప్రతీకలు, విలువలపై దాడులు జరుగుతున్నాయి. ఆ సమయంలో హిందువుల ప్రయోజనాలను కాపాడడానికి, నాయకత్వ సామర్థ్యం కలిగిన సంస్థ ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాంటి సంస్థగా ఆర్ఎస్ఎస్ నిలిచింది.
1964 ఆగస్టు 29న బొంబాయిలోని పొవైలో స్వామి చిన్మయానంద ఆశ్రమంలో ఒక సమావేశం జరిగింది. ఆ రోజు కృష్ణాష్టమి పర్వదినం. ఆ సమావేశానికి స్వామి చిన్మయానంద, సంత్ తుక్డోజీ మహరాజ్, సిక్కు గురువు తారాసింగ్, జైన గురువు సుశీల్ ముని, గీతాప్రెస్ నిర్వాహకులు హనుమాన్ ప్రసాద్ పోద్దార్, కెఎం మున్షీ, గురూజీ, మరో 40-45మంది ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వారంతా కలిసి విశ్వహిందూ పరిషద్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశంలోనే విశ్వహిందూ పరిషద్ స్థాపన మొదలైంది.
లక్ష్యాలు – విస్తరణ:
విశ్వహిందూ పరిషద్ ప్రధాన లక్ష్యం హిందూ సమాజాన్ని జాగృతం చేయడం, దాని హక్కులు, విలువలు, ప్రతీకలను కాపాడడం, విదేశాల్లో నివసిస్తున్న హిందువులతో సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం. విశ్వహిందూ పరిషద్ ఇంకా సేవాకార్యక్రమాల్లో కూడా క్రియాశీలంగా పాల్గొంటూ ఉంటుంది. స్వీయ ఉపాధి కల్పనను, సేంద్రియ వ్యవసాయాన్నీ ప్రోత్సహిస్తుంది.
పరిషద్ మొదటి ప్రధాన సదస్సు 1966 జనవరి 22 నుంచి 24 వరకూ ప్రయాగరాజ్‌లో కుంభమేళా సందర్భంగా జరిగింది. ఆ సదస్సుకు 12 దేశాల నుంచి 300మంది స్వామీజీలు సహా 25వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సదస్సులోనే మతమార్పిడుల సమస్య గురించి చర్చించారు, అప్పుడే ‘ఘర్ వాపసీ’ గురించి నిర్ణయం తీసుకున్నారు. ఆ సదస్సులోనే పరిషద్ సూత్రంగా ‘ధర్మో రక్షతి రక్షితః’, సంస్థ చిహ్నంగా ‘అక్షయ వటవృక్షం’ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
సామాజిక ఏకీకరణ ప్రయత్నాలు:
హిందూసమాజంలోని అంటరానితనం అనే సమస్య విశ్వహిందూ పరిషద్‌కు పెద్ద సవాల్‌గా నిలిచింది. దానికి సమాధానంగా పరిషద్ ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందించింది. అదేమంటే మరింత సంఘటితమైన, మరింత దగ్గరగా ఉండే సమాజాన్ని నిర్మించడమే. విహెచ్పి 58ఏళ్ళ ప్రయాణంలో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో చర్యలు తీసుకుంది. హిందూ సమాజం స్థితిగతుల్లో గణనీయమైన మార్పు తేవడంలో గుణాత్మక పాత్ర పోషించింది. విశ్వహిందూ పరిషద్ 1969 డిసెంబర్ 13, 14 తేదీల్లో కర్ణాటకలోని ఉడుపిలో ధర్మసంసద్ నిర్వహించింది. ఆ సమావేశంలో సామాజిక ఏకీకరణ గురించి చారిత్రక తీర్మానం చేసింది. గురూజీ ప్రయత్నాల ప్రేరణతో ఆ తీర్మానం సాకారమైంది. అదే. ‘‘హైందవః సోదరా స్సర్వే, న హిందు పతితో భవేత్’’ అంటే… ‘హిందువులందరూ సోదరులే, వారిలో ఎక్కువ తక్కువలు లేవు’ అని అర్ధం. సంసద్ భాగస్వాములు కూడా ఒక ప్రమాణం చేసారు. ‘మమ దీక్షా హిందూ రక్షా, మమ మంత్ర స్సమానతా’ అంటే ‘హిందువుల రక్షణకై దీక్ష స్వీకరిస్తున్నాను. సమానత్వమే నా మంత్రం’ అని అర్ధం. తద్వారా హిందూ ఐక్యతకు, సమానత్వానికీ నిబద్ధతను ప్రకటించారు.
సంస్థ విస్తరణ, సేవా కార్యక్రమాలు:
1982లో విశ్వహిందూ పరిషద్ నాయకుడిగా అశోక్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. సంస్థ విస్తరణకు ఆయన ఎంతగానో కృషి చేసారు. హిందూ సమాజాన్ని ఏకత్రితం చేసే ఉద్దేశంతో 1983లో చేపట్టిన ఏకతా యాత్ర ద్వారా విశ్వహిందూ పరిషద్ దేశవ్యాప్తంగా వేలాది గ్రామాలను కలిపింది. ఆ యాత్రలో ఆరు కోట్ల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. విశ్వహిందూ పరిషద్ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళడంలో ఆ యాత్ర ప్రధాన పాత్ర పోషించింది.
1984లో న్యూఢిల్లీలో నిర్వహించిన ధర్మసంసద్‌లో 125 సంప్రదాయాలకు చెందిన వందలాది సాధుసంతులు పాల్గొన్నారు. ఆ సదస్సు పరిషద్ ప్రాభవాన్ని మరింత పటుతరం చేసింది. అదే యేడాది రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించింది. 1984 అక్టోబర్ 8న విహెచ్పి యువజన విభాగం బజరంగ్ దళ్ ఏర్పాటైంది.
1994 నాటికి విశ్వహిందూ పరిషద్ సామాజిక ఏకీకరణలో గణనీయమైన ముందడుగులు వేసింది. గ్రామాల్లో పురోహితులుగా పనిచేసేందుకు వేలసంఖ్యలో గిరిజనులు, షెడ్యూల్డు కులాలు, వెనుకబడిన తరగతులకు చెందిన యువకులకు శిక్షణనిచ్చింది.
సేవా కార్యక్రమాలు:
విశ్వహిందూ పరిషద్ ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా లక్షకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటిలో సుమారు 70వేల సాంస్కృతిక కేంద్రాలు, 2వేలకు పైగా విద్యాసంస్థలు, 1800 ఆరోగ్య కేంద్రాలు, 1500 స్వయం సమృద్ధి కేంద్రాలూ ఉన్నాయి. అవి కాక ఎన్నో హాస్టళ్ళు, అనాథ శరణాలయాలు, వైద్యకేంద్రాలు, కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు, వొకేషనల్ ట్రయినింగ్ సెంటర్లూ ఉన్నాయి. హిందువుల ఐక్యత, సమాజ సేవ అనే రెండు అంశాల పట్ల నిబద్ధతతో పరిషద్ తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది.