గంజాయి స్మగ్లర్లకు పోలీసులు చెక్ పెట్టారు. అనకాపల్లి జిల్లాలో పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో 912 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ దీపిక మీడియాకు వెల్లడించారు. ఒడిషా నుంచి గంజాయి తరలిస్తోన్న ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో ఐదుగురిని పట్టుకోవాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. దీని విలువ మార్కెట్లో 90 లక్షలుపైగా ఉంటుందని తెలిపారు. గత వారం ఓ డీఎస్పీని గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టి పారిపోవడంతో నిఘా పెంచారు. భారీ బలగాలతో సోదాలు నిర్వహిస్తున్నారు.
విజయవాడలోనూ గంజాయి ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట పడింది. గడచిన నెల రోజుల్లో నగరంలో 200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ హరికృష్ణ తెలిపారు. 135 మందిపై 27 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. విజయవాడలో గంజాయి విక్రయించే 150 ప్రాంతాలను గుర్తించినట్లు డీసీపీ మీడియాకు చెప్పారు. త్వరలో విజయవాడను గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దుతామని డీసీపీ స్పష్టం చేశారు.