కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రభుత్వ సేవలను ఇంటి వద్దే పొందే అవకాశం లభిస్తుందని హోంమంత్రి అమిత్ షా వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు లడఖ్ సర్వతోముఖాభివృద్దికి కట్టుబడి ఉందన్న అమిత్ షా, జాంస్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, ఛాంగ్ థాంగ్ జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఐదు కొత్త జిల్లాలతో లడఖ్ లో మొత్తం జిల్లాల సంఖ్య ఏడుకు చేరనుంది. లడఖ్ సర్వతోముఖాభివృద్ధికి, ప్రజలకు మెరుగైన అవకాశాల కల్పన, మెరుగైన పాలన అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా పేర్కొన్నారు.
లడఖ్ అభివృద్ధి ప్రయాణంలో కొత్త జిల్లాల ఏర్పాటు మరో ముందడుగు అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. లడఖ్ వాసులకు అభినందనలు తెలిపారు.