జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం బీజేపీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాను వెనక్కి తీసుకుంది. జాబితాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన బీజేపీ, సవరించిన పేర్లతో త్వరలోనే మరో జాబితా విడుదల చేస్తామని తెలిపింది. కొద్ది సేపటి తర్వాత 15 మంది అభ్యర్థుల పేర్లతో మరో జాబితాను విడుదల చేసింది.
జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇటీవల షెడ్యూల్ ప్రకటించింది. ఈక్రమంలో పొత్తులు, మేనిఫెస్టో విడుదల, అభ్యర్థుల జాబితాల ప్రకటనలతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఉదయం 44 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా ప్రకటించింది. కానీ, మధ్యాహ్నం ఈ జాబితాను వెనక్కు తీసుకుంది. తర్వాత 15 మంది అభ్యర్థులతో సవరించిన జాబితాను ప్రకటించింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు పెట్టుకుంటున్నాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో పేచీ ఏర్పడింది. సుదీర్ఘ చర్చల తర్వాత సీట్ల పంపకంపై సయోధ్య కుదిరింది.