‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మోనిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ – హైడ్రా’, మహానగరంలో ఇప్పటివరకూ 166 నిర్మాణాలను కూల్చివేసింది. హైదరాబాద్‌లో 18 చోట్ల చెరువులు, పార్కులు ఆక్రమించి కట్టిన 166 నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. సినీనటుడు నాగార్జున ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేతతో హైడ్రా చర్యలకు ప్రముఖంగా గుర్తింపు వచ్చింది.
హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 18 చోట్ల సుమారు 44 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేసారు. నటుడు నాగార్జున, ఎంఐఎం ఎంఎల్‌ఎ మొహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎంఎల్‌సి మీర్జా రహమత్ బేగ్, బీజేపీ నాయకుడు సునీల్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు రత్నాకరం సాయిరాజు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, ప్రొ-కబడ్డీ టీం యజమాని శ్రీనివాస్ భార్య అనుపమ తదితరులకు చెందిన కట్టడాలను కూల్చివేసారు.
జులై నెలలో మొదలుపెట్టి ఇప్పటివరకూ మొత్తం 166 నిర్మాణాలు కూల్చేసామని హైడ్రా వెల్లడించింది. ఆక్రమణలకు మద్దతిస్తున్నవారిపైనా చర్యలు తీసుకుంటోంది. నందగిరి హిల్స్ వద్ద పార్కు గోడ కూల్చివేసి ఆక్రమించిన స్థానికులకు అండగా నిలిచిన ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ మీద కేసు పెట్టింది.