అందాల పోటీ మిస్ ఇండియా జాబితాలో దళిత, ఆదివాసీ వర్గాలకు చోటు దక్కటం లేదని లోక్సభ ప్రతిపక్షనేత రాహల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలు పిల్ల చేష్ఠల్లా ఉన్నాయని ఎద్దేవా చేసిన కిరణ్ రిజిజు , వెనకబడిన వర్గాల వారిని హేళన చేయవద్దు అని దుయ్యబట్టారు.
ఎక్స్ వేదికగా స్పందించిన కిరణ్ రిజిజు, మిస్ ఇండియా పోటీలు, సినిమాలు, ఆటల్లో రిజర్వేషన్లు కావాలని రాహుల్ కోరడాన్ని తప్పుపట్టారు. పిల్ల చేష్ఠలు వినోదానికే పనికి వస్తాయని చురకలు అంటించారు. విభజన వ్యూహాలతో వెనకబడిన వర్గాలను ఎగతాళి చేయకండని హితవు పలికారు.
రాష్ట్రపతి పదవిలో గిరిజన మహిళ, ప్రధానిగా ఓబీసీ, రికార్డు సంఖ్యలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందినవారు కేబినెట్ మంత్రులు ఉన్నారని గుర్తుచేశారు. వీరంతా రాహుల్ కు కనిపించటం లేదా అని కిరణ్ రిజిజు ప్రశ్నించారు.
ప్రయాగ్ రాజ్ పర్యటనలో మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ , మిస్ ఇండియా పోటీల జాబితాలో దళిత, ఆదివాసీ, ఓబీసీ మహిళ లేదని వ్యాఖ్యానించారు. క్రికెట్, బాలీవుడ్ లో కూడా దళిత, ఆదివాసీలు లేరన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు పలువురు బీజేపీ కౌంటర్ ఇస్తున్నారు.