మక్ కీ బాత్ లో ప్రస్తావించిన ప్రధాని మోదీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ, ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళుతోందన్న ప్రధాని మోదీ, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందన్నారు. చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా ఈ ఏడాది తొలిసారి అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నామని వివరించారు. గతంలో లేని విధంగా ఇప్పుడు స్పేస్ సైన్స్ పట్ల యువత ఆకర్షితులు అవుతున్నారని తెలిపారు.
రాజకీయాల్లోకి రావాలనే పిలుపుతో యువత నుంచి స్పందన వచ్చిందని, క్రియాశీల రాజకీయాల వైపు యువత మొగ్గుచూపుతోందని ప్రధాని మోదీ వివరించారు. ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారం సామాజిక ఉత్సవంగా మారిందని తెలిపారు.
నాడు స్వాతంత్ర్య పోరాటంలో అన్ని వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయని గుర్తు చేసిన ప్రధాని మోదీ రాజకీయ నేపథ్యం లేకున్నా స్వాతంత్ర్యం కోసం పోరాడిన విషయాన్ని మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ఇప్పుడు వికసిత భారత్ సాకారానికి కూడా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని చాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.