హెజ్బొల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అక్టోబర్ 7 ఘటనకు మించి అతిభారీ స్థాయి కుట్రను భగ్నం చేసినట్లు వివరించింది. తమ సైన్యానికి చెందిన దాదాపు 100 యుద్ధ విమానాలు లెబనాన్‌లోకి వెళ్లి వేలాది రాకెట్ లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ తెలిపింది. తమపై దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.
దేశాన్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటామన్న నెతన్యాహు, ఉత్తర ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఈ చర్యలు తీసుకొంటామన్నారు. దేశంలో 48 గంటల అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లు రక్షణ మంత్రి గాలంట్ తెలిపారు.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్‌కు చెందిన మీడియా తెలిపింది. హెజ్బొల్లా ఏకంగా 6,000 రాకెట్లతో దాడికి సిద్ధమైందని, అక్టోబర్ 7న హమాస్ చేసిన 5,000 రాకెట్ల దాడి కంటే ఇది పెద్దదని ఇజ్రాయెల్ చెబుతోంది.
ఇజ్రాయెల్ రక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆ దేశ రక్షణ మంత్రి గాలంట్‌తో ఫోన్లో మాట్లాడారు.
ఇప్పటికే హెజ్బొల్లా 11 ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 320 కత్యూషా రాకెట్లను ప్రయోగించింది.