ప్రధాని నరేంద్ర మోదీ, తమ దేశానికి రావాలని పాకిస్తాన్ ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్లో ఇస్లామాబాద్ వేదికగా జరిగే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్జీ)సమావేశానికి మోదీతో సహా షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో)కు చెందిన ఇతర నేతలను కూడా ఆహ్వానించింది.
గత ఏడాది ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన ఎస్సీవో సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షిజిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలు పాల్గొన్నారు.
పాకిస్తాన్ తో సమస్యాత్మక సంబంధాల నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి ప్రధాని మోదీ సిద్ధంగా లేరని విదేశాంగ మంత్రి జైశంకర్ను అక్కడకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది బిష్కెక్లో జరిగిన సీహెచ్జీ సమావేశానికి జైశంకర్ హాజరయ్యారు. పాకిస్తాన్ లో చివరిసారిగా 2015లో అప్పటి భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పర్యటించారు.
రష్యా, చైనా నేతృత్వంలోని సీహెచ్జీలో భారత్, పాకిస్తాన్ సభ్యులుగా ఉన్నాయి. ప్రాంతీయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారం పై ఇది పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం సీహెచ్జీకి అధ్యక్షత వహిస్తున్న పాకిస్తాన్ లో అక్టోబర్ 15, 16 తేదీల్లో దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమావేశంలో నాయకులు స్వయంగా పాల్గొనలేని పరిస్థితుల్లో వర్చువల్ విధానం ఉంటుందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.