ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు పర్యాటకులకు మరింత ఆహ్లాదం పంచనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో సరికొత్త హంగులతో కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పర్యాటక ప్రదేశాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దనున్నారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు అధునాతన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర పర్యాటక శాఖే ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద అభివృద్ధి చేయనున్నారు.
అల్లారు సీతారామరాజు జిల్లాలోని ఈ బొర్రా గుహలను ఏటా 7 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారితో పాటు తెలంగాణ, ఒడిశా , తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమబంగాల్ నుంచి ఇక్కడికి వచ్చి సరదగా గడుపుతారు.
ప్రస్తుతం వచ్చేవారి సంఖ్యను రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బొర్రా రైల్వే స్టేషన్ మొదలుకొని పార్కింగ్ ప్రదేశాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించనున్నారు. అభివృద్ధి చేస్తారు.
సందర్శకుల కోసం ప్రత్యేక భవన నిర్మాణంతో పాటు కేఫ్టేరియా, టాయిలెట్స్, రెస్ట్ రూమ్స్, సమాచార కేంద్రం, టికెట్ బుకింగ్ కౌంటర్, లాకర్లు ఏర్పాటు చేయనున్నారు. గుహ లోపల అభివృద్ధి పనుల్లో భాగంగా మెట్ల మార్గాలు, ఫ్లోరింగ్, రెయిలింగ్ ఏర్పాటు చేయనున్నారు.