ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రస్తుతం అమలవుతోన్న సీపీఎస్ పరిధిలో యూనిఫైడ్ పెన్షన్ పథకం ( యూపీఎస్) అమల్లోకి తీసుకురావాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీని ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో (national pension system) చేరిన 23 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. 2004 ఏప్రిల్ 1 తరవాత ఉద్యోగంలో చేరిన వారంతా యూపీఎస్ పరిధిలోకి వస్తారు. 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ అమల్లోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కలుపుకుంటే 90 లక్షల మందికిపైగా ప్రయోజనం చేకూరుతుంది.
ఈ పథకంలో రాష్ట్రాలు చేరితే వారే భారం భరించాలి. ఇక 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి వేతనంలో సగం పెన్షన్‌గా ఇస్తారు. ఇందులో పెన్షన్ పొందాలంటే కనీసం పదేళ్లు సేవలు అందించాలి. దీని ద్వారా కేంద్రంపై 6200 కోట్ల భారం పడుతుంది. ఉద్యోగులు చెల్లించే పెన్షన్ మొత్తం ఏ మాత్రం పెరగదు. కేంద్రం చెల్లించే 14.5 శాతం ఇక నుంచి 18 శాతానికి పెరుగుతుంది.