జమ్ముకశ్మీర్ సోపోర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో సోపోర్ పోలీసులు,32 నేషనల్ రైఫిల్స్ సంయుక్త బృందం రఫియాబాద్,సోపోర్‌లో గాలింపు చర్యలు చేపట్టింది. దీంతో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ప్రతీగా కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
సంఘటనా స్థలంలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. హతమైన ఉగ్రవాది వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు ముందు భద్రతా బలగాలు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన పీవోకే నివాసిని గుర్తించి అరెస్ట్ చేశాయి. సదరు వ్యక్తిని జహీర్ హుస్సేన్‌గా నిర్ధారించారు. పూంచ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నాయి.
జమ్మూ కశ్మీర్లో త్వరలో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతా బలగాలను మోహరించింది. దాదాపు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను , శ్రీనగర్, హంద్వారా, గందర్బల్, బుద్గాం, కుప్వారా, బారాముల్లా, బందిపోరా, అనంత్‌నాగ్, షోపియాన్, పుల్వామా, అవంతిపోరా, కుల్గామ్లలో మోహరించారు.
కశ్మీర్ లోయలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సహస్త్ర సీమా బాల్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులతో సహా 298 కంపెనీల పారామిలటరీ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.