స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులు ఇవాళ కూల్చివేశారు. దీనిపై ఎక్స్ వేదికగా నాగార్జున స్పందించారు.
స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం బాధాకరమన్న నాగార్జున, తమ ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము చర్యలు చేపట్టలేదన్నారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం సక్రమమే అన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరైనట్లు తెలిపారు. ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదన్నారు.
తప్పుడు సమాచారంతో, చట్ట విరుద్ధంగా కూల్చివేత జరిగిందని ఆరోపించారు. కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు.
ఈ విషయమై హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పందించారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఏకంగా చెరువులోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయో తెలుసుకుంటున్నామన్నారు.