ఉక్రెయిన్ స్వతంత్రం తర్వాత మొదటిసారి ఆ దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చరిత్ర సృష్టించిందని ఆ దేశ అధ్యక్షుడు వొలొమిదిర్ జెలెన్స్కీ అన్నారు. భారత్-ఉక్రెయిన్ వేర్వేరు రంగాల్లో నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేసాయని జెలెన్స్కీ చెప్పారు.
మోదీ పర్యటన తర్వాత వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యం, మిలటరీ సాంకేతిక సహాయం తదితర రంగాల్లో సహకరించుకోడానికి అంగీకరించామని జెలెన్స్కీ చెప్పారు.
ప్రధాని మోదీ ఈ ఉదయం పోలండ్ నుంచి ప్రత్యేక రైల్లో కీవ్ చేరుకున్నారు. 1991లో ఉక్రెయిన్ రష్యా నుంచి విడిపోయి స్వతంత్రదేశంగా ఏర్పడ్డాక ఆ దేశంలో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధాని మోదీయే.
సుమారు మూడేళ్ళుగా రష్యాతో యుద్ధం నేపథ్యంలో, ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణ కోసం సాగే ప్రయత్నాల్లో భారత్ క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని నరేంద్రమోదీ, జెలెన్స్కీతో చెప్పారు.
‘‘భారతదేశం తటస్థంగా లేదు. మొదటినుంచీ మేము కచ్చితంగా ఒక పక్షానే ఉన్నాము. అది శాంతి పక్షం. మేము బుద్ధుడి భూమి నుంచి వచ్చాము. అక్కడ యుద్ధానికి తావు లేదు. మేము మహాత్మా గాంధీ గడ్డ నుంచి వచ్చాము. ఆయన మొత్తం ప్రపంచానికి ఇచ్చిన సందేశం శాంతే’’ అని మోదీ స్పష్టంగా చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తన చర్చల వివరాలను మోదీ జెలెన్స్కీకి వివరించారు. సెప్టెంబర్ 2022లో సమర్ఖండ్లోనూ, గత నెల మాస్కోలోనూ పుతిన్‌తో మోదీ సమావేశమయ్యారు. ‘‘సమర్ఖండ్లో పుతిన్‌తో కలిసినప్పుడు ఇది యుద్ధాల సమయం కాదని స్పష్టం చేసాను. ఏ సమస్యకైనా యుద్ధభూమిలో పరిష్కారం దొరకదు అని వివరించాను’’ అని మోదీ జెలెన్స్కీకి చెప్పారు.
మోదీ కీవ్ పర్యటనను దౌత్యపరంగా సమతౌల్యం సాధించే చర్యగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత నెలలో ఆయన రష్యా పర్యటనపై కొన్ని పాశ్చాత్య దేశాలు ఆవేదన వ్యక్తం చేసాయి. అయితే, రష్యా-ఉక్రెయిన్ వంటి పరిస్థితుల్లో ఇరు పక్షాల మధ్యా వాస్తవిక కార్యాచరణ ద్వారా మాత్రమే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందనీ… అప్పుడే శాంతి, సుస్థిరత సాధించగలమనీ మోదీ స్పష్టం చేసారని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వివరించారు. ఆ క్రమంలోనే తాజాగా మోదీ ఉక్రెయిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సమగ్రంగా సంస్కరించాలని ఇరుపక్షాలూ పిలుపునిచ్చాయి. వర్తమాన ప్రపంచ వాస్తవికతలను దృష్టిలో పెట్టుకుని భద్రతామండలిలో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పిస్తేనే ఆ సంస్థ ప్రపంచ శాంతి, భద్రతల విషయోం సమర్ధంగానూ, ప్రభావశీలంగానూ పనిచేయగలదని భారత్, ఉక్రెయిన్ వ్యాఖ్యానించాయి. భద్రతామండలి విస్తరణకు, అందులో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికీ ఉక్రెయిన్ మద్దతిస్తోందని, మోదీ-జెలెన్స్కీ భేటీ సందర్భంగా ఆ దేశం పునరుద్ఘాటించింది.