ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కట్టడాన్ని ‘హైడ్రా’ బృందం కూల్చివేసింది. మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేత జరిగింది. తుమ్మిడి చెరువును ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం ఈ ఏజెన్సీ ప్రధాన లక్ష్యాలు. హైడ్రా ఏర్పాటైన తర్వాత నిత్యం ఏదో ఒకచోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారు.
అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఫిర్యాదు అందినట్లు సమాచారం. ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మంత్రి లేఖ రాశారు. దీంతో విచారణ చేపట్టిన హైడ్రా, కూల్చివేత చర్యలు చేపట్టింది.