బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని భారతసరిహద్దులో ఆ దేశ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. సిల్హెట్ వద్ద దేశం దాటేందుకు మాజీ జడ్జి షంషుద్దీన్ చౌదురి మాణిక్ ప్రయత్నించగా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
సిల్హెట్‌లోని కనైఘాట్ సరిహద్దు మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిగా షంషుద్దీన్‌ను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. అవామీ లీగ్ నాయకుడు ఫిరోజ్‌ను కూడా అతని నివాసంలో అరెస్టు చేశారు.
బంగ్లాదేశ్ లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ ఆగస్టు 8న తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణస్వీకారం చేశారు.
హసీనా ప్రభుత్వంలో పనిచేసిన పలువురు మంత్రులతో పాటు ఉన్నతాధికారులను కూడా ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకుల ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారంతా సైనిక స్థావరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను చట్టబద్దంగా తమకు అప్పగించాలంటూ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) డిమాండ్ చేస్తోంది.