గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులు ఈ నెల 27లోగా అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఆన్లైన్ ద్వారా వచ్చిన ధరఖాస్తులను కలెక్టర్ లు పరిశీలిస్తారు. అనంతరం వాటిని ప్రాధాన్యాల వారీగా విభజిస్తారు. ఈ నెల 29, 30 న బదిలీల కౌన్సిలింగ్ కు దరఖాస్తు చేసుకున్నవారు హాజరు కావాల్సి ఉంటుంది.
అవసరం మేరకు ఏ ఉద్యోగినైనా తప్పనిసరిగా బదిలీ చేసే అధికారం కూడా కలెక్టర్ లకు ఉంటుంది. ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగులు బదిలీలకు అనర్హులుగా పేర్కొంది. బదిలీ అయిన ఉద్యోగులకు టీటీఏ గానీ మరే ఇతర ప్రయోజనాలు లభించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏ ఉద్యోగీ తమ స్థానిక గ్రామ, వార్డుల్లో పోస్టింగ్ కోసం దరఖాస్తు చేయకూడదని తేల్చి చెప్పింది.
నాన్ ఐటీడీఏ ప్రాంతాలతో పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యం ఉంటుంది. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ళు మించి పని చేసిన వారు బదిలీకి అర్హులుగా ప్రభుత్వం తెలిపింది.