భారతదేశం ఇవాళ మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటోంది. ప్రపంచ రోదసీ పరిశోధనల్లో ఎదురులేని శక్తిగా భారత్ నిలిచిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజును ‘నేషనల్ స్పేస్ డే’గా ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది ఇదే రోజు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయవంతం అయింది. ఇప్పటివరకూ ఏ దేశమూ సాధించలేకపోయిన, చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగిడిన, రికార్డును భారత్ ఇదేరోజు సాధించింది.
చంద్రయాన్ 3: ఘన విజయం
చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలం మీద విజయవంతంగా దిగగలగడం, భారతదేశపు అంతరిక్ష పరిశోధనారంగ ప్రస్థానంలో మేలిమలుపు. ఆ ప్రయోగం కేవలం భారతదేశపు సాంకేతిక ఘనతను మాత్రమే ప్రదర్శించలేదు, శాస్త్రవిజ్ఞానంలో పురోగతి సాధించడంలో భారత్ నిబద్ధతను ప్రపంచానికి చాటిచెప్పింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద నీటి జాడలు, ఇతర విశిష్ఠ లక్షణాలను భారత్ కనుగొని, శాస్త్రప్రపంచానికి వెల్లడించింది. ఆ మిషన్ విజయం అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశపు సామర్థ్యానికి మచ్చుతునకగా నిలిచింది.
చంద్రుడి దక్షిణ ధ్రువం మీద నీరు, మంచు నిల్వలు పెద్దస్థాయిలో ఉండవచ్చునన్న అంచనాల వల్ల భారతదేశపు ఈ ప్రయోగం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భవిష్యత్తులో చంద్రుడి మీద కాలనీలు ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించే క్రమంలో శాస్త్రవేత్తలు చంద్రుడి దక్షిణధ్రువం గురించి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకూ ఏ దేశమూ చేరలేకపోయిన ఆ ప్రాంతానికి భారతదేశం విజయవంతంగా చేరుకోవడం కొత్త పరిశోధనలకు మార్గాలను తెరిచింది. చంద్రుడి దక్షిణధ్రువ ప్రాంత రహస్యాలను వెలికితీసే ప్రయోగాలకు బాటలు వేసింది.
ఆ అరుదైన ఘనతను గౌరవించుకునే క్రమంలో, విక్రమ్ ల్యాండర్ చంద్రుడిమీద అడుగుపెట్టిన స్థలానికి ‘శివశక్తి పాయింట్’ అని పేరు పెట్టారు. ల్యాండర్ ద్వారా చంద్రుడి ఉపరితలం మీదకు చేరిన ప్రజ్ఞాన్ రోవర్, చంద్రుడి ఉపరితలం గురించి విలువైన సమాచారాన్ని ఇస్రోకు అందించింది.
అంతరిక్ష రంగంలో విజయాల దశాబ్దం:
గత దశాబ్ద కాలంలో భారత అంతరిక్ష పరిశోధనా రంగం అసాధారణ అభివృద్ధిని నమోదు చేసింది. లాంచింగ్‌లో ఇస్రో సత్తాను చాటుతూ, భారత్ మొత్తం 431 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఆ విజయాలు ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ వ్యూహాత్మక పాత్రను ప్రతిఫలిస్తున్నాయి. స్పేస్ మిషన్‌లలో, ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. ఆ ప్రయోగాలు భారతదేశపు సాంకేతిక ఘనతను చాటడం మాత్రమే కాదు, దేశానికి నిలకడగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గంగానూ మారాయి. తద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సేవ చేస్తున్నాయి.
అంతరిక్ష విజయాల ఆర్థిక ప్రభావం:
భారతదేశ అంతరిక్ష రంగపు వేగవంతమైన విస్తరణ దేశీయ ఆర్థిక అభివృద్ధిని ఉరకలు పెట్టించింది. పారిశ్రామిక ప్రగతికి ఈ రంగం ఉత్ప్రేరకంగా నిలిచింది. 2020లో అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించడంతో 300కు పైగా అంకుర సంస్థలు పుట్టుకొచ్చాయి. ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆదరైజేషన్ సెంటర్ – ఇన్‌స్పేస్’ అండతో ఆ అంకుర సంస్థలు సాంకేతిక సృజనలో ముందుకు సాగుతున్నాయి, భవిష్యత్ అంతరిక్ష రంగ పరిశోధనలకు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆ వాతావరణం స్పేస్ టెక్నాలజీని పరుగులు పెట్టిస్తుంది, భారత అంతరిక్ష రంగాన్ని కొత్తయెత్తులకు తీసుకెడుతుంది.
భావి శాస్త్రవేత్తల సాధికారత: ‘యువిక’
భారత ప్రభుత్వం 2019లో ‘యువ విజ్ఞాని కార్యక్రమ్ – యువిక’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానిద్వారా ఇప్పటివరకూ వెయ్యి మందికి పైగా విద్యార్ధులకు అంతరిక్ష విజ్ఞానశాస్త్రంలో కెరీర్ నిర్మించుకోడానికి అవసరమైన నైపుణ్యాలను, పరిజ్ఞానాన్నీ కల్పించారు. ఆ కార్యక్రమం ఇప్పటివరకూ నూరు శాతం ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ సాధించింది. ‘యువిక’ ద్వారా నైపుణ్యాలు సాధించిన విద్యార్ధులు దేశం నలుమూలల్లోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు. శాస్త్రీయ ప్రతిభ కలిగిన భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో ఈ ‘యువిక’ కార్యక్రమం కీలక భూమిక వహిస్తోంది.
పెరిగిన బడ్జెట్, విస్తరించిన మిషన్ స్థాయి:
అంతరిక్ష పరిశోధనలకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యం, దానికి చేస్తున్న కేటాయింపుల్లో ప్రతిఫలించింది. స్పేస్ సెక్టార్ బడ్జెట్ 132శాతానికి పెరిగింది. దానివల్ల ఇస్రో తన పరిశోధనల పరిధిని మరింత విస్తరించగలుగుతుంది. ఏటా చేపట్టే మిషన్‌ల సంఖ్య పెరుగుతుంది. తద్వారా అంతరిక్ష పరిశోధనల్లో భారత్ స్థానం మరింత పురోగమిస్తుంది.
అంతర్జాతీయ భాగస్వామ్యాలు బలోపేతం
అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో భారత్ గణనీయమైన పాత్ర పోషిస్తోంది. ఆర్టెమిస్ ఒప్పందం మీద సంతకం చేసిన 27వ దేశంగా భారత్, శాంతియుతంగా-పరస్పర సహకారంతో చేపట్టే చంద్ర ప్రయోగాలకు నిబద్ధతను కలిగి ఉంది. ఇస్రో-నాసాల భాగస్వామ్యంలోని నిసార్ (నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ : ఎన్ఐఎస్ఎఆర్) ప్రాజెక్ట్ అంతర్జాతీయ సహకారంలో కొత్త అధ్యాయానికి తెర తీసింది.
భవిష్యత్ అవకాశాలు
అంతరిక్ష రంగంలో భారతదేశం గత దశాబ్దకాలంలో సాధించిన విజయాలు ఎన్నెన్నో. ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్ నుంచి మొదటి రాకెట్‌ను ప్రయోగించగలిగాం, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి రాకెట్‌కు త్రీడీ ప్రింటెడ్ ఇంజన్ అమర్చగలిగాం, ఎక్స్‌పోశాట్, ఆదిత్య ఎల్1 వంటి ప్రయోగాలు చేస్తున్నాం… ఇలా ఎన్నెన్నో ఘనతలు సాధిస్తూ, అంతరిక్ష పరిశోధనారంగంలో భారతదేశం తనదైన ముద్ర వేస్తోంది. గగన్‌యాన్ మిషన్, 2035నాటికి సొంత స్పేస్‌స్టేషన్ వంటి ప్రణాళికలు భారత్‌ను గ్లోబల్ స్పేస్ పవర్‌గా నిలబెడతాయి.