సిపిఐ (మావోయిస్టు) ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ, కోవర్టు అన్న అనుమానంతో ఒక మహిళను హత్య చేసింది. ఆ విషయాన్ని ఆగస్టు 19న ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. బంటి రాధ అలియాస్ నీల్సో (25) కమాండర్‌గా ఉండేదనీ, ఆమె విప్లవద్రోహిగా మారినందున హత్య చేసామనీ ప్రకటించింది. అందులో ఇంకా దారుణం ఏమంటే ఆమె ప్రవర్తన మీదా దారుణమైన ఆరోపణలు చేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడింది.
హైదరాబాద్‌కు చెందిన బంటి రాధ ఇంటర్ వరకూ చదువుకుని తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసింది. 2018లో స్వచ్ఛందంగా విప్లవోద్యమంలో చేరింది. ఈ ఆరేళ్ళలోనూ ఏఓబీలోనే మావోయిస్టుగా పని చేసింది. అక్కడ ఆమెకు నీల్సో అనే మారుపేరు తగిలించారు. ఈ ఆరేళ్ళలోనే పార్టీ సభ్యురాలిగా, జోన్ మిలటరీ ఇన్‌స్ట్రక్టర్‌గా, నాయకత్వ రక్షణదళం కమాండర్‌గా ఎదిగింది. ఆమె కోవర్టుగా మారి పోలీసులకు సమాచారం అందిస్తోందని భావించిన పార్టీ నాయకత్వం ఆమెను మూడు నెలల క్రితం కమాండర్ బాధ్యతల నుంచి సస్పెండ్ చేసింది.
రాధను పోలీసులు ఉద్యమం నుంచి బైటకు తీసుకురావడానికి ప్రయత్నించారనీ, కుటుంబసభ్యులను చంపుతాము లేదా జైల్లో పెడతామని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నారనీ మావోయిస్టులు ఆరోపించారు. స్నేహితురాలు, తమ్ముడి ద్వారా ఫోన్లు చేయించి రాధను కోవర్టుగా మార్చారని, అప్పటినుంచీ ఆమె తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసు, ఇంటలిజెన్స్ అధికారులతో సంబంధంలో ఉంటూ వారు కోరినట్లు మావోయిస్టు పార్టీ, వారి నాయకత్వం గురించి సమాచారం పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తోందని ఆరోపించారు.
రాధ అలియాస్ నీల్సోను సస్పెన్షన్ తర్వాత ఏఓబీ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేశ్ అధీనంలో ఉంచారు. విచారణ చేసి, విప్లవద్రోహి అన్న ముద్ర వేసి తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురంలో హత్య చేసారు.
రాధ హత్య గురించిన ప్రకటనలో సిపిఐ మావోయిస్టు పార్టీ ఆమెపై దారుణమైన వ్యక్తిగత ఆరోపణలు చేసింది. ‘‘మొదటినుండి కొన్ని బలహీనతల్ని కూడా కలిగి ఉన్నది. పెళ్ళి, స్త్రీ పురుష సంబంధాల విషయంలో పార్టీ పద్ధతులకు లోబడకుండా వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. క్రమంగా నిజాయితీగా ఉండకపోవడం, పార్టీని కొన్ని విషయాలలో పక్కదారి పట్టించడం చేస్తూ వచ్చింది’’ అంటూ మావోయిస్టు పార్టీ, రాధ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది.