(స్వామి లక్ష్మణానంద సరస్వతిని వర్ధంతి నేడు)
సరిగ్గా పదహారేళ్ళ క్రితం ఇదే రోజు స్వామి లక్ష్మణానంద సరస్వతిని హత్య చేసారు. ఆయన చేసిన తప్పేమిటంటే హైందవ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పదిమందికీ పంచిపెట్టడం, మతమార్పిడులకు వ్యతిరేకంగా నిలబడడం. ఒక్కడుగా నిలిచి అమాయక ఒరియా గిరిజనులను మతం మార్చే కుట్రలను నిలువరించిన పాపానికి లక్ష్మణానంద సరస్వతిని బలి తీసుకున్నారు. ఆయన జీవితం నిస్వార్థ సేవకు, గిరిజన తెగల సంక్షేమానికీ, వారి దేశీయ సంస్కృతి-ధర్మాల పరిరక్షణకు అంకితమైంది.
ఒడిషా కొంధమాల్ జిల్లాలోని గుర్జాంగ్ గ్రామంలో 1924లో జన్మించిన స్వామి లక్ష్మణానంద సరస్వతి బాల్యం నుంచే ఆధ్యాత్మిక, సంఘసేవా మార్గాల వైపు మొగ్గుచూపారు. పెళ్ళయి ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక తృష్ణ ఆయనను సన్యాస జీవితం వైపు నడిపింది, హిమాలయాలకు వెళ్ళిన స్వామి, అక్కడ కఠోరమైన సాధనామార్గంలో ప్రయాణించారు.
1965లో హిమాలయాల నుంచి తిరిగి ఒడిషా చేరుకున్న స్వామి లక్ష్మణానంద, గో సంరక్షణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసారు. క్రమంగా ఆయన తన జీవితం ఒడిషాలోని గిరిజనుల సేవకోసమే అన్న విషయాన్ని గుర్తించారు. ఆ గిరిజనుల ఉద్ధరణ, సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేసారు.
స్వామి లక్ష్మణానంద కొంధమాల్ జిల్లాలోని చకపద్ అనే మారుమూల గ్రామాన్ని కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ఆ గ్రామంలోని ప్రఖ్యాతి చెందిన బిరూపాఖ్యా (విరూపాక్ష) ఆలయాన్ని కేంద్రంగా చేసుకుని గిరిజనుల సామాజిక, విద్యా, ఆధ్యాత్మిక అభ్యున్నతికి సంబంధించిన పలు కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆ గిరిజనుల్లో పానో తెగకు చెందినవారే ఎక్కువ. 1969లో ఆయన తన మొదటి ఆశ్రమాన్ని చకపద్‌లో ప్రారంభించారు. ఆ ఆశ్రమం అనతి కాలంలోనే స్థానిక గిరిజనుల అభ్యున్నతి కోసం పని మొదలుపెట్టింది.
గిరిజనుల అభ్యున్నతి కోసం స్వామి లక్ష్మణానంద నాలుగు దశాబ్దాల పాటు అలుపూ సొలుపూ లేకుండా పని చేసారు. వారి ఆధ్యాత్మిక, ధార్మిక దృక్పథంతోపాటు వారి సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం కూడా కృషి చేసారు. చకపద్‌లో సంస్కృత పాఠశాల సహా ఎన్నో విద్యాసంస్థలు స్థాపించారు. ఆ సంస్కృత పాఠశాల అనంతర కాలంలో కళాశాలగా ఎదిగింది. 1988లో ఆయన కొంధమాల్‌లోని జాలేస్‌పేటలో శంకరాచార్య కన్యాశ్రమ్ పేరిట పూర్తిస్థాయి బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభించారు. ఇప్పుడా విద్యాసంస్థ ఏటా 250 మంది బాలికలకు చదువు చెబుతోంది. గిరిజన మహిళలకు విద్య ద్వారానే సాధికారత లభిస్తుందన్న ఆయన నమ్మకం, నిబద్ధతకు ఆ సంస్థ నిదర్శనంగా నిలిచింది.
గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల పరిరక్షణ పట్ల లక్ష్మణానంద నిబద్ధులై పనిచేసారు. కొంధమాల్ ప్రాంతంలో గిరిజనుల మందిరాలను ఎన్నింటినో పునరుద్ధరించారు. గజపతి, కొంధమాల్ జిల్లాల్లో రథయాత్రలు నిర్వహించారు. తద్వారా వేలాది గిరిజనులు తమ పూర్వీకుల విశ్వాసాలను కొనసాగించగలిగారు.
పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించిన స్వామి, కొంధమాల్ జిల్లాలో అటవీ పరిరక్షణకు గణనీయమైన కృషి చేసారు. అడవులను రక్షించుకోవలసిన అవసరాన్ని ఆయన స్థానిక తెగలకు వివరించి చెప్పారు. అటవీ నిర్వహణ పద్ధతికి రూపకల్పన చేసారు. అనంతరకాలంలో ప్రభుత్వం అదే విధానాన్ని స్వీకరించింది. లక్ష్మణానంద సరస్వతి కార్యశీలత వల్లనే కొంధమాల్‌లో పర్యావరణం మెరుగుపడింది. అది ఒడిషాలోనే అతి ఎక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లాగా అభివృద్ధి చెందింది.
అన్యాయం, హింసలను ప్రతిఘటించిన స్వరం:
స్వామి లక్ష్మణానంద గోవధకు తీవ్ర వ్యతిరేకి. రాష్ట్రవ్యాప్తంగా గోవుల సంరక్షణ కోసం నిరంతరాయంగా పనిచేసారు. గో రక్షణ కోసం ఆయన ఎన్నో నిరసనలు, నిరాహారదీక్షలు, ప్రజాచైతన్య ప్రచార కార్యక్రమాలూ నిర్వహించారు. ఆయన ప్రయత్నాలు ఏ మతానికో పరిమితం కాలేదు, సంస్కృతిని పరిరక్షించుకోడానికి కొనసాగాయి. సామాజిక న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ కోసం స్వామి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
అమరత్వం, వారసత్వం:
గిరిజనులను బలవంతంగా మతం మార్చే ప్రయత్నాల నుంచి రక్షించడానికి నిరంతరాయంగా చేసిన ప్రయత్నాల కారణంగా మతమార్పిడి ముఠాలు స్వామిని లక్ష్యం చేసుకున్నాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా ఆయన తన లక్ష్యం నుంచి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. 2008 ఆగస్టు 23 రాత్రి కొంధమాల్ జిల్లా జాలేస్‌పేటలోని తన ఆశ్రమంలోనే ఆయనను దారుణంగా హత్య చేసారు. ఆ దుర్ఘటన మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతి పరిచింది. కొంధమాల్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతల విషయాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చింది. క్రైస్తవ మిషనరీలే ఆయనను హత్య చేయించారని స్థానిక గిరిజనుల విశ్వాసం.
బెదిరింపులు, హెచ్చరికలు:
తన హత్యకు ముందు స్వామి లక్ష్మణానందకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ప్రత్యేకించి 2008 ఆగస్టు 10 నుంచి 21 లోగా ఆయనకు మూడు లేఖలు వచ్చాయి. ఆయనను ఎత్తుకుపోతామని, హత్యచేస్తామనీ ఆ లేఖల్లో బెదిరించారు. ఆ విషయమై పోలీసులకు పదేపదే ఫిర్యాదులిచ్చినా ఆయనకు భద్రత ఏర్పాటు చేయలేదు. చివరికి పోలీసులు రక్షణ పంపించిన రోజునే ఆయన హత్య జరిగింది.
దాడి, హత్య జరిగిన క్రమం:
2008లో ఆగస్టు 23 శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆరోజు రాత్రి సుమారు 7.30 సమయంలో, సాయంకాల ప్రార్థన ముగిసాక స్వామీ లక్ష్మణానంద సరస్వతి ఆశ్రమ వాసులతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో 15మంది ముసుగులు ధరించిన దుండగులు ఎకె-47 రైఫిళ్ళు, ఇతర ఆయుధాలతో ఆశ్రమంలోకి చొరబడ్డారు.
మొదట వారు ఆశ్రమవాసి అయిన బాబా అమృతానంద్‌నే స్వామి అనుకుని అతన్ని కాల్చివేసారు. స్వామిని రక్షించడానికి ప్రయత్నించిన మాతా భక్తిమాయి అనే భక్తురాలిని, కిషోర్ బాబా అనే మరో భక్తుడినీ కూడా కాల్చి చంపేసారు.
భక్తిమాయి స్వామిని ఒక గది టాయిలెట్‌లో దాచిపెట్టింది. ఆ విషయం గ్రహించిన దుండగులు అక్కడకు చేరుకుని స్వామిని కాల్చి చంపేసారు. అప్పుడు ఆయన వయసు 84 సంవత్సరాలు.
హత్యకు కారణాలు:
గిరిజన ప్రజలను చట్టవిరుద్ధంగా మోసపూరితంగా బలవంతంగా క్రైస్తవంలోకి మతం మార్చే ప్ర్రక్రియలను అడ్డుకోడానికి లక్ష్మణానంద అవిశ్రాంతంగా కృషి చేసారు. కొంధమాల్ జిల్లాలోని మూలవాసీ గిరిజనుల సముద్ధరణ కోసం 40ఏళ్ళుగా పాటుపడ్డారు. సామాజికంగా, ధార్మికంగా, ఆర్థికంగా వారి ఉన్నతికి కృషి చేసారు. గోవధకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, క్రైస్తవ మిషనరీల అక్రమ భూఆక్రమణలను బైటపెట్టడంతో ఆయనను లక్ష్యం చేసుకున్నారు. స్వామి లక్ష్మణానంద చేపట్టిన కార్యక్రమాల వల్ల ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయ విశ్వాసాలకు మరింత చేరువ అయ్యారు. వారిని ఎలాగైనా మతం మార్చాలన్న క్రైస్తవ మిషనరీల ప్రయత్నాలకు లక్ష్మణానంద అడ్డుగోడగా ఉన్నారు.
స్వామిపై దాడులు, భద్రతా వైఫల్యాలు:
స్వామీ లక్ష్మణానంద సరస్వతిపై 2008నాటి దాడి మొదటిది కాదు. అంతకుముందు ఆయనను చంపడానికి 8సార్లు ప్రయత్నించారు. 1969 నుంచి 2007 వరకూ ఎనిమిది సార్లు స్వామిపై హత్యా ప్రయత్నాలు జరిగాయి. అన్నిసార్లూ ఆయన తీవ్రగాయాలతో బైటపడ్డారు. అన్ని దాడులు జరిగినా ఆయనకు తగిన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆయన హత్య జరిగిన రోజు ఆయనకు ఒకేఒక భద్రతాధికారి ఉన్నాడు. అతను కూడా ఆరోజు సెలవులో ఉన్నాడు. అలా, ఒడిషాలోని ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతి కోసం నాలుగు దశాబ్దాల పాటు కృషి చేసిన స్వామి జీవితాన్ని మతమార్పిడి మాఫియా ముఠా బలి తీసుకుంది. స్వామి లక్ష్మణానంద సరస్వతి తన తుదిశ్వాస విడిచేవరకూ గిరిజనుల సేవలోనే గడిపిన ధన్యజీవి.