పోలింగ్ బూత్ ధ్వంసం చేసిన కేసులో నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కారంపూడి సీఐ సుధాకర్ బాబుపై దాడి చేసి గాయపరిచాడనే ఆరోపణలపై కూడా పిన్నెల్లిపై కేసు నమోదైంది. రెండు నెలలుగా కేసును విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తు సమర్పించడంతోపాటు, ప్రతి వారం సమీపంలోని పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని కోర్టు షరతులు విధించింది. పిన్నెల్లి పాసుపోర్టు కూడా పోలీసులకు స్వాధీనం చేయాలని ఆదేశించింది.