ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వేటు వేసింది. అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపై కూడా వేటు పడింది. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి అక్రమంగా ఇతర సంస్థలకు నిధులు మళ్లించారని తేలింది. దీని వల్ల రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిందన్నారు. బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా వారిని ఖాతరు చేయకుండా నిధులు మళ్లించారని సెబీ అధికారులు చెబుతున్నారు. నిధులను అక్రమంగా మళ్లించి పెట్టుబడిదారులను తీవ్ర నష్టాల్లోకి నెట్టివేయడంతో అనిల్ అంబానీపై ఐదేళ్లు నిషేధం విధించింది.
ఆరేళ్ల కిందట రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ (reliance housing finance ) షేరు విలువ రూ.59గా ఉంది. ప్రస్తుతం దాని విలువ రూ.0.75 పైసలకు పడిపోయింది. లక్షలాది మంది ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ 9 లక్షల మంది పెట్టుబడిదారులున్నారని సెబీ తెలిపింది. పెట్టుబడిదారులను దారుణంగా మోసం చేసిన వ్యవహారంలో అనిల్ అంబానీ, అతనికి చెందిన 24 సంస్థలు ఐదేళ్ల పాటు స్టాక్ మార్కెట్లలో ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది.