శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకల విలువను అధికారులు లెక్కించారు. మొక్కులు, కానుకల రూపంలో ఆదిదంపతులకు రూ.3.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టు 2 నుంచి 22 వరకు అంటే 20 రోజులకు గాను భక్తులు హుండీలో వేసిన నగదు లెక్కించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపు జరిపినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
మొత్తం 20 రోజుల్లో రూ.3,22,53,862 కోట్ల నగదు ఆదాయం రాగా, 150 గ్రాముల 100 మిల్లీ గ్రాముల బంగారం, 5 కేజీల 250 గ్రాముల వెండి ని భక్తులు స్వామివారికి సమర్పించారు.
విదేశీ కరెన్సీలో భాగంగా యూఎస్ఏ డాలర్లు 746, కెనడా డాలర్లు 125, ఆస్ట్రేలియా డాలర్లు 50, ఇంగ్లాండ్ పౌండ్స్ 70, సింగపూర్ డాలర్లు 26, యూఏఈ దీర్హామ్స్ 50, యూరోలు 20, మలేషియా రింగేట్స్ 125, ఖతార్ రియాల్స్ 2, ఒమాన్ రియాల్స్ 1 స్వామి, అమ్మవార్లకు సమర్పించారు.
ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 24 నుంచి ప్రఖ్యాత ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే ప్రవచనాల కార్యక్రమాన్ని శ్రీశైల క్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గణేశ గాథలు అనే అంశంలో భాగంగా 9 రోజుల పాటు ప్రవచన కార్యక్రమం జరగనుంది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద గణపతి ఆవిర్భావ గాథలు, గణపతి తత్వం, గణపతి స్వరూపంలోని అంతరార్థాలు, గణపతి మహిమా విశేషాలు, మొదలైన అంశాలను భక్తులకు వివరిస్తారు.