(నేడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి)
సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 ఆగస్టు 23న జన్మించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ‘వారాలు’ చేసుకుని చదువుకుని, ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు ఆయన.
టంగుటూరి ప్రకాశం పంతులు గారు జన్మించినది వినోదరాయునిపాలెం. ఒంగోలు నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో సుబ్బమ్మ, గోపాలకృష్ణ దంపతులకు జన్మించారు. ఆయనకు 11 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయారు. తల్లి ఒంగోలు వచ్చి ఒక భోజనాల హోటలును నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. బీదరికంలో ఉన్న ప్రకాశం వీధిదీపాల కింద చదువుకోవలసి వచ్చేది. ఇమ్మానేని హనుమంతరావు గారు అనే ఉపాధ్యాయుడు ప్రకాశం గారిని రాజమహేంద్రవరంలో ఉన్నత విద్యాభ్యాసంలో చేర్పించారు. 1890 సంవత్సరంలో మెట్రిక్యులేషన్, అంటే ఇప్పటి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. ప్రకాశం గారికి న్యాయశాస్త్రం చదవాలని అభిలాష ఉండేది. దానికోసం మద్రాసు వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి, న్యాయవాదిగా అక్కడే ప్రాక్టీసు ప్రారంభించారు.
అప్పుడే సైమన్ కమిషన్ రాకకు నిరసన ప్రదర్శన జరిగింది. ఆ సమయంలో ఆందోళనకారులను తరిమివేయడానికి తెల్లదొరల పోలీసులు ప్రజల మీదకు తుపాకులు ఎక్కుపెట్టారు. అందరూ భయపడుతుంటే ప్రకాశం గారు వెనుకడుగు వేయక పోలీసుల ముందుకు వెళ్ళి ఎదురురొమ్ము విరిచి, దమ్ముంటే తుపాకిగుండుతో కాల్చమని గుండెనిచ్చారు. న్యాయవాది ధైర్యానికి జడిసిన పోలీసులు తామే వెనుకడుగు వేసారు. ఆనాటి నుంచీ ఆయనకు ‘ఆంధ్రకేసరి’ అనే బిరుదు వచ్చింది.
టంగుటూరి ప్రకాశం పంతులు గారు 31 ఏళ్ళ వయసులోనే 1904లో రాజమండ్రి మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు వెన్నుదన్నుగా ‘ఓగేటి రామకృష్ణయ్య’ గారు ఆర్థికంగా ఎంతో సహకరించారు. రాజకీయాల్లో ప్రతిపక్షంగా ఉన్న రామచంద్రరావు సైతం మద్దతునిచ్చారు.
ప్రకాశం పంతులు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, న్యాయవాది. ఆ రోజుల్లోనే లండన్ వెళ్ళి బారిస్టర్ చదివి వచ్చి న్యాయవాద వృత్తి చేపట్టిన వాడాయన. అంతేకాదు, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు వ్రాసిన గయోపాఖ్యానం నాటకంలో గయుడిగా, అర్జునుడిగా నటించారు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మదనమోహన్ మాలవీయ నాయకత్వంలో చేరి, దానికి రాజీనామా ఇఛ్చి స్వతంత్ర పార్టీ స్థాపించారు. దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గాంధీ గారితో కొంత విభేదించినా, ఒక్కోసారి గాంధీగారు కూడా ఆయన మాట వినేవారు, ఆయనను ఒప్పించారు.
వారు 84 సంవత్సరాలు జీవించి, 1957 మే 20న హైదరాబాదులో మరణించారు. అయితే ఆయన నివసించిన ఇల్లు ఒంగోలులోని ‘ఐలండ్ విల్లా’ను మాత్రం ప్రభుత్వం ఆయన స్మారకంగా ఉంచలేకపోయింది. చివరకు ఆయన విగ్రహాలు మాత్రం మనకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి అనడంలో సందేహం లేదు.
వారి భార్య పేరు హనుమాయమ్మ. భర్తకు తగిన భార్య. జీవితాంతం వారి అడుగుజాడల్లో నడిచింది.
వారు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రకాశం బ్యారేజ్‌ను కె.ఎల్ రావు గారి నేతృత్వంలో నిర్మించారు. 1972 డిసెంబరులో వారి గుర్తుగా అప్పటి ప్రభుత్వం ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చింది.
‘‘రండిరా యిదే! కాల్చుకొండిరా’’ యని నిండు
గుండెలిచ్చిన మహోద్దండమూర్తి
పట్టింపు వచ్చెనా బ్రహ్మంత వానిని
గద్దించి నిలబెట్టు పెద్దమనిషి
తనకు నామాలు పెట్టిన శిష్యులను గూడ
ఆశీర్వదించు దయామయుండు
సర్వస్వము స్వరాజ్య సమరయజ్ఞమునందు
హోమమ్మొనర్చిన సోమయాజి
అతడు వెలుగొందు ముక్కోటి ఆంధ్రజనులు
నమ్మి కొల్చిన ఏకైక నాయకుండు
మన ‘‘ప్రకాశము’’ మన మహామాత్యమౌళి
సరిసములు లేని ‘‘ఆంధ్రకేసరి’’ యతండు!
(కరుణశ్రీ గారి ‘ఉదయశ్రీ’ మూడవ భాగము నుండి)