దొంగలు చాకచక్యంగా వ్యవహరించి డబ్బు కొట్టేస్తూ ఉంటారు. ఇక దొంగల వద్దే పోలీసులు నగదు కాజేసిన ఘటన నందిగామలో వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా ఏసీపీ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు చత్తీస్గఢ్ బిలాస్పూర్లో 300 బస్తాల మిర్చి అమ్మాడు.ఆ డబ్బును లారీ డ్రైవర్ షేక్ ఖయీంకు అప్పగించాడు. ఆ లారీకి క్లీనరుగా నందిగామ మండల సోమవరం గ్రామానికి చెందిన పల్లెపోగు కోటేశ్వరరావు పనిచేస్తున్నాడు. బిలాస్పూర్ నుంచి లారీ పాల్వంచ రాగానే పని ఉందంటూ కోటేశ్వరరావు లారీ దిగి వెళ్లిపోయాడు. కొంత దూరం వచ్చాక అనుమానం వచ్చిన డ్రైవర్ ఖయీం నగదు పరిశీలించగా బ్యాగు కనిపించలేదు. కోటేశ్వరావుపై అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జొన్నలగడ్డ జంక్షన్ వద్ద పల్లెపోగు కోటేశ్వరరావును అరెస్ట్ ( crime news) చేశారు. అతని వద్ద నుంచి రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేవలం 18.50 లక్షలే రికవరీ చేసినట్లు చూపించారు. ఆ తరవాత క్లీనర్ అసలు విషయం చెప్పడంతో ఓ ఏఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లను ఏసీపీ సస్పెండ్ చేశారు. వారి నుంచి మూడున్నర లక్షలుపైగా రాబట్టారు. మిగిలిన సొమ్ము ఏమైందనే విషయం విచారణ జరుపుతున్నారు.