కోల్‌కతా ఆర్.జి కర్ ఆస్పత్రిలో 31ఏళ్ళ వైద్యురాలి హత్య, అత్యాచారం ఘటన జరిగిన రోజు పోలీసుల వ్యవహారశైలి అంతా తప్పులతడకలుగా ఉందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన 30ఏళ్ళ కెరీర్లో అంత చెత్తగా దర్యాప్తు చేసిన కేసును ఎప్పుడూ చూడలేదని జస్టిస్ పర్దీవాలా మండిపడ్డారు.
గురువారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కోల్‌కతా పోలీసుల పనితీరును చీల్చిచెండాడింది. ప్రధానంగా మూడు అంశాలపై న్యాయస్థానం పోలీసుల వ్యవహారశైలి మీద నిప్పులు కురిపించింది. శవాన్ని కనుగొన్న సమయానికీ, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయానికీ మధ్య సుదీర్ఘ వ్యవధి, పోస్ట్‌మార్టం తర్వాత కూడా అసహజ మృతిగా పేర్కొనడం, నేరం జరిగిన ప్రదేశాన్ని సీల్ చేయడంలో 12గంటలకు పైగా జాప్యం… ఈ మూడింటి వల్లా దర్యాప్తు పూర్తిగా దారితప్పిపోయిందని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
సిబిఐకి ప్రాతినిధ్యం వహించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆ కేసులో కాలక్రమాన్ని నమోదు చేయడంలో చూపిన నిర్లక్ష్యాన్ని వివరించడంతో తన వాదన మొదలుపెట్టారు. మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత రాత్రి 11.45కు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ స్పందించారు. ఈ కేసులో జనరల్ డైరీని పోలీసులు ఉదయం 10.10కి నమోదు చేసారు, కానీ నేరం జరిగిన స్థలాన్ని మాత్రం రాత్రి 10.10కి సీల్ చేసారు. అంతసేపూ అక్కడ ఏం జరిగింది? అని ప్రశ్నించారు.
దానికి జవాబుగా, పోస్ట్‌మార్టం రాత్రి 7.10కి ముగిసిందనీ, అయినప్పటికీ అసహజ మరణంగా ఫిర్యాదును రాత్రి 11.30కు నమోదు చేసామని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆ సందర్భంలో జస్టిస్ జె.బి పర్దీవాలా జోక్యం చేసుకున్నారు. ‘‘అది అసహజమైన మరణమా? అలా అయితే శవపరీక్ష అవసరం ఏముంది? రాత్రి 11.30కి అసహజ మరణంగా ఫిర్యాదు నమోదయింది. ఆ వెంటనే కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్ నమోదయింది. అసలు మీరు కోర్టుకు కచ్చితమైన సమాచారం ఇవ్వండి’’ అని ప్రశ్నించారు.
దానికి జవాబివ్వకుండా రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాది మౌనంగా ఉండిపోయారు. ‘‘ఇలా మీరు అయోమయం కలిగించకండి. తదుపరి విచారణకు బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్‌ను తీసుకురండి’’ అని పర్దీవాలా మండిపడ్డారు. ‘‘అసలు ఎఎస్పి ఎవరు? దర్యాప్తులో అతని పాత్ర మీద అనుమానాలున్నాయి. అతను ఇలా ఎలా దర్యాప్తు చేస్తాడు?’’ అని ఆగ్రహించారు.
జస్టిస్ మనోజ్ మిశ్రా మరో ప్రశ్న అడిగారు. ఆగస్టు 9 సంఘటన జరిగిన రోజు పోస్ట్‌మార్టం జరిగిన తర్వాత కూడా పోలీసులు అసహజ మరణంగా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేసారని తీవ్రంగా ప్రశ్నించారు.
కేసు జనరల్ డైరీలో మొదట అంటే మధ్యాహ్నం 1.45కు అసహజ మరణంగా నమోదయిందని రాష్ట్రప్రభుత్వం వివరించే ప్రయత్నం చేసింది. అయితే దర్యాప్తు ఎప్పుడు మొదలైందని జడ్జి అడిగారు. 3.45కు దర్యాప్తు మొదలైందని చెప్పగా, పోలీసుల తీరును పర్దీవాలా చీల్చి చెండాడారు.
‘‘నా 30ఏళ్ళ లీగల్ కెరీర్లో ఇలాంటి దర్యాప్తును ఎప్పుడూ చూడలేదు. శవపరీక్షకు ముందు అసహజ మరణం కేసు నమోదు చేస్తే, దానికి ప్రాతిపదిక ఏంటి? అలా కాక శవపరీక్ష తర్వాత అసహజ మరణంగా కేసు నమోదు చేస్తే, అలా ఎందుకు చేసారు? శవపరీక్ష జరిగింది, మరణానికి కారణం ఏమిటో తెలుసు. అయినా అసహజ మరణంగా ఎలా నమోదు చేసారు?’’ అంటూ ప్రశ్నించారు.
ఆ తర్వాత, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం జరగడం మీద కోర్టు దృష్టి సారించింది.
‘‘శవం ఉదయం 9.30కు లభ్యమైంది. ఎఫ్ఐఆర్ రాత్రి 11.30కు ఫైల్ చేసారు. సుమారు 14 గంటల ఆలస్యం. ఎందుకంత ఆలస్యమైంది? దానికి ఏ కారణమూ కనిపించడం లేదు’’ అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు.
అంతకుముందు, ఎలాంటి ఫిర్యాదూ రాని సందర్భాల్లో అసహజ మరణం కింద కేసు నమోదు అవుతుందని రాష్ట్రప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇటువంటి సందర్భాల్లో ఫిర్యాదు చేయవలసిన బాధ్యత ఆ సంస్థ ప్రధాన అధికారి మీద ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఆ వివరణ మీద చంద్రచూడ్ తన ప్రశ్నలు ఎక్కుపెట్టారు, ‘‘కళాశాల ప్రిన్సిపల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఎందుకు రాలేదు? అతన్ని ఎందుకు మరో ఆస్పత్రికి బదిలీ చేసారు. దానికి కారణమేంటో కోర్టుకు తెలిసి తీరాలి’’ అని నిలదీసారు.
ఆర్.జి.కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సిబిఐ సుమారు వారం రోజులుగా ప్రతీరోజూ ప్రశ్నిస్తోంది. తమ ప్రశ్నలకు ఆయన సంతృప్తికరమైన జవాబులు ఇవ్వలేకపోతున్నారని సిబిఐ అధికారులు చెబుతున్నారు. సిబిఐ గురువారం నాడు సుప్రీంకోర్టుకు తమ దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్‌ను అందించారు. దాని వివరాలు బహిర్గతం చేయలేదు. కేసు విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసారు.