పాత ఫోన్లు కొంటాం అంటూ.. మీ వీధిలో ఎవరైనా కేకలు వేయగానే ఎగిరి గంతేసి, ఫోన్ అమ్మేశారా. ఇక అంతే సంగతి. భవిష్యత్తులో ఆ ఫోన్ సాయంతో దొంగల ముఠాలు చేసే అరాచకాలు మీకు చుట్టుకునే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల పాత ఫోన్లు కొంటామంటూ కొన్ని ముఠాలు వీధి వీధికి తిరుగుతున్నాయి. కొన్ని ఫోన్లకు డబ్బు, మరికొన్ని పాత మోడళ్లకు ప్లాస్టిక్ వస్తువులు ఇస్తూ వేలాది ఫోన్లు సేకరించిన బిహార్ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 వేల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కొన్ని సైబర్ ముఠాలు (cyber crime) పాత ఫోన్లు సేకరించి వాటికి మరమ్మతు చేసి, నేపాల్ నుంచి తెచ్చిన దొంగ సిమ్‌లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దొంగతనాల విచారణ సమయంలో సీడీఎంఏ నెంబరు పరిశీలిస్తే అమాయకుల పేరుతో ఉంటున్నాయని పోలీసులు తెలిపారు. అందుకే పాత ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ అమ్మ వద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పాతఫోన్లను అమ్మితే అందులో ఉండిపోయిన మీ డేటా కూడా దొంగల భారినపడే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఇంట్లో నాలుగైదు పని చేయని ఫోన్లు కనిపిస్తూనే ఉంటాయి. అడ్డుగా ఉన్నాయి కదా అని అడ్డు తొలగించుకుంటే, భవిష్యత్తులో ఎలాంటి కొత్త సమస్యలు వస్తాయో చెప్పలేం. అందుకే పాత ఫోన్లు అమ్మేయడంలాంటి పనులు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.