కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష బిజెపి ఉపనాయకుడు అరవింద్ బెల్లాడ్, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసారు. సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని హిందూ ధార్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందంటూ మండిపడ్డారు. ఆ మేరకు పర్యాటక శాఖకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. హిందువులను దెబ్బతీసి ముస్లిములను బుజ్జగించేందుకే సిద్దరామయ్య ప్రభుత్వం అలాంటి ఆదేశాలు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
‘‘భారతదేశంలో పుణ్యక్షేత్రాల సందర్శనకు చాలా ప్రాధాన్యం ఉంది. తీర్థయాత్రలు చేయడం, ధార్మిక ప్రదేశాలకు పర్యటించడం మన చరిత్రలో ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. చాలామందికి ప్రయాణాలు అంటే పుణ్యక్షేత్రాల సందర్శనలే. భారతదేశంలో సుమారు 95శాతం మంది పర్యాటకులు ధార్మిక ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు. అటువంటి ప్రదేశాలను ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహించాలి’’ అని అరవింద్ బెల్లాడ్ స్పష్టం చేసారు.
కాంగ్రెస్ ప్రభుత్వపు తాజా ఉత్తర్వులు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నాయని బెల్లాడ్ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘హిందూ దేవాలయాలు ఉండే ప్రదేశాలను పర్యాటక స్థానాలుగా అభివృద్ధి చేయవద్దంటూ పర్యాటక శాఖకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ సర్క్యులర్ రాష్ట్రంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. ఆ నిర్ణయానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పర్యాటక శాఖ మంత్రి ఎచ్.కె.పాటిల్ బాధ్యులు. వారు ఆ ఆదేశాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా హిందువులను సమీకరించి ఆందోళనలు చేపడతాం. ప్రభుత్వం వేల కోట్ల నిధులు కేటాయించి ముస్లిములను బుజ్జగించడానికి ప్రాధాన్యం ఇస్తోంది కానీ హిందువులను నిర్లక్ష్యం చేస్తోంది. ఎందుకు? పర్యాటక శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను ఎందుకు నిలిపివేసారు?’’ అంటూ బెల్లాడ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
దేవాలయాల్లో అభివృద్ధి పనులకు ముజరాయి విభాగానికి గ్రాంట్లు ఉంటాయన్న సాకు చూపి, పర్యాటక శాఖ ఆలయాల్లో కనీస అభివృద్ధి పనులు సైతం చేపట్టకపోవడం సరి కాదని అరవింద్ బెల్లాడ్ ప్రభుత్వ ఉత్తర్వులను తప్పు పట్టారు. ప్రభుత్వ తాజా ఆదేశాల వల్ల కేవలం చిన్నచిన్న పనులకు మాత్రమే అనుమతులకు అవకాశం ఉంది. భారీ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత వాటిల్లుతోంది. అలాగే, ప్రైవేటు భూముల్లో చేపట్టే లేదా ప్రైవేటు వ్యక్తులు చేపట్టే కార్యక్రమాలకు ఎలాంటి సాయమూ లేకుండా చేయడాన్ని కూడా తప్పుపట్టారు. అటువంటి పనులను గుర్తించి వాటిని తక్షణమే ఆపివేయాలంటూ కార్యనిర్వాహక శాఖ ఆదేశాలు జారీ చేసింది.