ఉత్తరప్రదేశ్‌లో మరో లవ్‌జిహాద్ కేసు బైటపడింది. లఖ్‌నవూకు చెందిన బాధిత యువతి చెప్పిన వివరాల మేరకు ఒక ముస్లిం వ్యక్తి ఆమెతో బంధం కోసం తన ఉనికిని దాచిపెట్టి, దొంగపేరుతో వంచించాడు. ప్రేమ పేరిట దారుణంగా మోసం చేసి, ఆమెకు తెలియకుండా మత్తుమందునిచ్చి, లైంగికంగా వేధించాడు.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జియా ఉల్ హక్ అనే వ్యక్తి ఆమెకు రెండేళ్ళ క్రితం పరిచయం అయ్యాడు. అప్పుడు తన పేరు జై అనీ, బారాబంకీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాననీ చెప్పుకున్నాడు. తన నిజమైన ఉనికిని దాచిపెట్టి, హిందువునని చెప్పుకుని స్నేహం పెంచుకున్నాడు.
ఒకరోజు అతను శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన బాధితురాలు మైకంలో ఉండగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిని వీడియో తీసి, అప్పటినుంచీ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తను చెప్పినట్లు చేయకపోతే ఆమె వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించసాగాడు.
బాధితురాలికి కొన్నాళ్ళకు అతను ముస్లిం అనీ, అతను ఉద్దేశపూర్వకంగానే తనను తాను హిందువుగా పరిచయం చేసుకున్నాడనీ తెలిసింది. అతని మోసాలు తెలిసిన తర్వాత, కొద్దిగా ధైర్యం తెచ్చుకుని అతన్ని ప్రతిఘటించడానికి బాధితురాలు ప్రయత్నించింది. ఆ క్రమంలో జియా ఉల్ హక్ ఆమెపై భౌతిక దాడులకు పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. నిందితుడు జియా ఉల్ హక్‌ను అరెస్ట్ చేసారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.